Telangana group-1
-
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో 128 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక కూడా కొంతమంది అభ్యర్థులను పక్కనపెట్టడంపై... అక్రమాలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఇచ్చిన స్టేను హైకోర్టు ఇవాళ ఎత్తివేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి
ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 సర్వీస్‌లో ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేసి ఆ అధికారులనే జాయింట్ కలెక్టర్, శాఖాధిపతులుగా నియమిస్తే పరిపాలనలో సమతుల్యత ఏర్పడుతుందని వారు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది యాయవిరుద్ధమే కాకుండా వివిధ శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, అధికారులు శశికిరణాచారి, అలోక్‌కుమార్, సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, పద్మజ, అనితాగ్రేస్, రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వొద్దు
- సీఎస్‌ను కోరిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడి స్థానికత కలిగిన అధికారులను కమల్‌నాథన్ కమిటీ తెలంగాణకు కేటాయిస్తోందని, ఇది సరికాదని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తెలంగాణ స్థానికులు కాని రాష్ట్ర స్థాయి అధికారులకు రాష్ట్రంలో పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు శశికిరణాచారి, రఘు, ప్రసాద్, అరవింద్‌రెడ్డి, అలోక్‌కుమార్, వేణు, మాధవరెడ్డి సోమవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల విభజనలో స్థానికతను బట్టి ఏరాష్ట్ర అధికారులను ఆ రాష్ట్రానికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఖాళీలు లేకపోయినా స్థానికత ప్రకారమే కేటాయింపులు జరగాలని, ఆప్షన్లకు ప్రాధాన్యం ఇవ్వొద్దని విన్నవించారు. -
శాస్త్రీయంగా ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విభజనపైన కూడా శాస్త్రీయమైన, హేతుబద్ధమైన విధానాలను పాటించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.హనుమంతునాయక్ మంత్రుల బృందాని(జీఓఎం)కి అందజేసిన నివేదికలో విజ్ఞప్తి చేశారు. సర్వీసు రిజిస్టర్లో నమోదైన సొంత జిల్లా ఆధారంగా అధికారులను విభజనానంతరం ఆయా రాష్ట్రాలకు పంపించాలని సూచించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు జీఓఎంకు సమర్పించిన నివేదిక గురించి వివరించారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్ స్థాయి పోస్టులలో ప్రస్తుతం 20 నుంచి 30 శాతం స్థానికేతరులు ఉన్నారని వారినందరినీ సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న సొంత జిల్లాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు పంపించాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 3వ షెడ్యూల్లో పేర్కొన్న గ్రూప్-1 ఉద్యోగాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్డీఓ, డీఎస్పీ, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్, జాయింట్ కమిషనర్ వంటి అధికారులను కూడా సర్వీసు రిజిస్టర్లో నమోదైన జిల్లా ఆధారంగా పంపించాలన్నారు. తెలంగాణకు బదిలీ చేయండి : ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విభజనానంతరం ‘ఇన్సైడర్’ కోటా కింద తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు. ముల్కీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని ‘తెలంగాణ వాసి’ని నిర్వచించాలని, తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత కూడా 371-డి అధికరణను కొనసాగించాలని, తాత్కాలిక ఉమ్మడి రాజధాని కాలపరిమితిని 10 సంవత్సరాల నుంచి 3 ఏళ్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేందుకు ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా, రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు సభ్యులుగా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఉద్యోగుల విభజనపై కేంద్రం నిర్దిష్టమైన మార్గదర్శకాలను వెల్లడించాలని చంద్రశేఖర్‌గౌడ్, హనుమంతునాయక్ కోరారు. -
సీమాంధ్రలోని తెలంగాణ అధికారుల్ని బదిలీ చేయాలి
సీఎస్‌కు తెలంగాణ గ్రూప్-1 అధికారుల వినతి సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరగౌడ్ నేతృత్వంలో గోపీనాథ్‌రెడ్డి, అంజన్‌రావు, ప్రేమ్‌కుమార్, నాగరాజు, యాదగిరితో కూడిన ప్రతినిధిబృందం మంగళవారం సీఎస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. సీమాంధ్రలో సమ్మె విరమించే వరకు తాత్కాలికంగా అక్కడినుంచి తెలంగాణ అధికారులను ఓడీ మీద శాఖాధిపతుల కార్యాలయాల్లో నియమించాలని ఈ బృందం విన్నవించింది. ఒకవేళ బదిలీ సాధ్యం కానిపక్షంలో వారికి తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఎవరైనా బదిలీ కావాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే బదిలీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్లకు కూడా సానుకూలంగా స్పందిం చారు’’ అని చంద్రశేఖరగౌడ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.