ట్రంప్ చెకింగ్ మొదలైంది.. ఇక తిప్పి పంపుడే!
ట్రంప్ చెకింగ్ మొదలైంది.. ఇక తిప్పి పంపుడే!
Published Fri, Feb 24 2017 4:53 PM | Last Updated on Tue, Oct 2 2018 7:43 PM
తగిన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో వలస ఉంటున్నవాళ్లందరినీ తిప్పి పంపేస్తామని, సుమారు 1.1 కోట్ల మంది వరకు ఇలా వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అన్నంతపనీ చేస్తున్నారు. తగిన పత్రాలు లేకుండా తమ దేశంలో తిరుగుతున్నట్లుగా భావిస్తున్న కొంతమంది వ్యక్తుల కోసం అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం తనిఖీలు మొదలుపెట్టింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఇలా దిగుతాడని భావించిన ఒక వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ప్రతి ప్రయాణికుడి వద్ద వాళ్ల గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన డెల్టా ఫ్లైట్ 1583లో వచ్చిన ప్రయాణికులంతా తమ గుర్తింపుకార్డులు చూపించాలని సీబీపీ ఏజెంట్లు అడిగారు. ఆ విమానం జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండయిన వెంటనే ప్రయాణికులు దిగకముందే ఈ తనిఖీలు చేశారు. అయితే, వాళ్లు వెతుకుతున్న వ్యక్తి మాత్రం ఆ విమానంలో లేడు.
ఆ వ్యక్తికి ఇప్పటికే డిపోర్టేషన్ ఉత్తర్వులు వెళ్లాయని, అతడు పలు నేరాల్లో దోషిగా తేలాడని సీబీపీ అధికారులు చెప్పారు. గృహహింస, ఇతర నేరాల్లో కూడా అతడు దోషి అని తెలిపారు. అయితే.. అధికారులు భారీ ఎత్తున ఇలా తనిఖీలు చేయడంతో ప్రయాణికులు ఆ విషయాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత ఫెడరల్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని ఎలా గుర్తించి, అదుపులోకి తీసుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులను ప్రశ్నించేందుకు ప్రయత్నించినా వాళ్లు అందుబాటులోకి రాలేదు.
Advertisement
Advertisement