రెండో హరిత విప్లవం కావాలి | Second Green Revolution needed, says Modi | Sakshi
Sakshi News home page

రెండో హరిత విప్లవం కావాలి

Published Mon, Jun 29 2015 2:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రెండో హరిత విప్లవం కావాలి - Sakshi

రెండో హరిత విప్లవం కావాలి

తూర్పు భారత్ నుంచే తక్షణం మొదలవ్వాలి: మోదీ
దేశంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది..
ఆధునీకరించేందుకు సర్కారు కట్టుబడి ఉంది
యూపీ, బిహార్, బెంగాల్, జార్ఖండ్, అస్సాం,
ఒడిశాల్లో రెండో హరిత విప్లవం మొదలవ్వాలి
భూసారం, విత్తనాలు, నీటి వినియోగంపై పరిశోధనలు జరగాలి
జార్ఖండ్‌లో వ్యవసాయ పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేసిన ప్రధాని

 
హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదివారం జార్ఖండ్‌లోని బార్హీలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో హరిత విప్లవానికి సమయం ఆసన్నమైందని.. ఇందులో ఇక ఏమాత్రం జాప్యం ఉండకూడదని పేర్కొన్నారు. ఇది తూర్పున ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అస్సాం, ఒడిషాలలో జరగాలన్నారు. అందుకే ఈ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని.. అందులో భాగంగానే ఈ వ్యవసాయ పరిశోధన సంస్థను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో కొన్ని ఎరువుల కర్మాగారాలు మూతపడ్డాయంటూ.. రైతులకు ఎరువులు అవసరమైనందున వాటిని తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉత్పాదకతను పెంచటంలో శాస్త్రీయ పద్ధతులను వినియోగించాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు.

విస్తృతమైన సమగ్ర ఏకీకృత ప్రణాళికను రూపొందించనిదే.. రైతుల జీవితాలను మార్చలేమని పేర్కొన్నారు. ‘ప్రతి బొట్టుకూ మరింత పంట’ అని నినదిస్తూ.. భూసారం ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు.. దానికి తగ్గ విత్తనాలు, నీటి పరిమాణం, ఎరువుల వినియోగం పరిమాణం వంటి అవసరాలపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. భూసార పరీక్షలో ప్రభుత్వం యువతకు శిక్షణనిస్తోందని.. తద్వారా మనుషుల రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల తరహాలో భూసార పరీక్షా కేంద్రాలనూ నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. దీనివల్ల ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందన్నారు.

దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున భారత్ వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం జరిగిందని గుర్తుచేశారు. రైతులకు ఐదు ఎకరాల సాగు భూమి ఉంటే.. అందులో కనీసం ఒక్క ఎకరాలోనైనా పప్పు ధాన్యాలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. భూసార ఆరోగ్య కార్డులు, నాణ్యమైన విత్తనాలు, విద్యుత్తు, సాగునీరు అందించటం ద్వారా భూమిని సక్రమంగా నిర్వహించేలా సాయం చేసే ప్రక్రియ మొదలైందని, విలువను చేర్చి సరైన మార్కెట్ కల్పిస్తామని మోదీ చెప్పారు.

జనాభా పెరుగుదల, భూ వనరులు కుదిచుకుపోవటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యాభై ఏళ్ల కిందట ఒక కటుంబానికి 20 ఎకరాల భూమి ఉండేది. కానీ.. భూమిని ముక్కలు చేస్తూ పోవటం వల్ల ఒక కుటుంబానికి ఎకరం, అర ఎకరం పొలం మాత్రమే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరగకపోతే ఆహార ధాన్యాల కొరత తలెత్తుతుందని, అది రైతుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
 
వర్షాలతో ప్రధాని వారణాసి పర్యటన రద్దు
వారణాసి: ప్రధాని మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసి పర్యటనను భారీ వర్షాల కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే.. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. వర్షాల కారణంగా పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. అందుకు వారణాసి ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని ఆయన జార్ఖండ్ పర్యటన ముగిసిన తర్వాత ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement