తమిళ సినీ దర్శకుడు సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్‌గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.