హామీతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు | Seemandhra congress MPs back put in Parliament | Sakshi
Sakshi News home page

హామీతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు

Published Wed, Aug 14 2013 3:50 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Seemandhra congress MPs back put in Parliament

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వారం రోజులుగా పార్లమెంటులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొంటామని, సీమాంధ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతామని ఇచ్చిన హామీతో తమ పార్టీ ఎంపీలు ఆందోళనను విరమించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, లోక్‌సభ చీఫ్ విప్ సందీప్ దీక్షిత్ పార్లమెంటు ఆవరణలో విలేకరులతో చెప్పారు. సభా కార్యక్రమాలకు అవరోధం కలిగించకుండా పార్లమెంటు ఆవరణలో వారు నిరసన తెలుపుతున్నారని.. అందువల్ల వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే, మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అనే నినాదాలు ముద్రించిన చొక్కాలు ధరించి ఆందోళనను కొనసాగించగా.. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు మాత్రం సభల్లోకి రాకుండా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. కాగా.. టీడీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన కొనసాగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన ఆహార భద్రత బిల్లుపై చర్చించాల్సిన సమయంలో సభకు అడ్డుతగులుతున్న టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ మీరాకుమార్‌ను కోరతామన్నారు.
 
 కమల్ నాథ్ మాటలపై రగడ..
 గొడవ చేస్తే సభను నడపబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మంగళవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ఆయన బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఆక్షేపించారు. దీంతో కమల్‌నాథ్ వెనక్కి తగ్గారు. జోషీ అంటే తనకు గౌరవమని, తన వ్యాఖ్యలతో ఆయన మనసు గాయపడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని అన్నారు. మరోపక్క.. సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, ‘కమల్ నాథ్ వినయం అలవర్చుకోవాలి. ఏం చెబుతున్నామో ముఖ్యం కాదు, ఎలా చెబుతున్నామో ముఖ్యం’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement