సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
ఎంపీలకు ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్
ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి
ఉద్యమం ఎలా ఉందో కర్నూలుకు వచ్చి తెలుసుకో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్
సమైక్యాంధ్ర కోసం గర్జించిన కర్నూలు
సాక్షిప్రతినిధి, కర్నూలు: ‘పొత్తులు, ఎత్తులతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తాం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పుడు అన్ని పార్టీలకు చెందిన అభిమానులు ఉన్నందున పార్టీల గురించి ఇప్పుడే ప్రకటించబోం. సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల్లోని ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎంపీల రాజీనామాలపై ఒత్తిళ్లు పెంచుతాం. అదే సమయంలో శాసనసభ్యులంతా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే వారికి రాజకీయ భవిష్యత్తు మిగులుతుంద’ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు.
కర్నూలులో ఆదివారం జరిగిన ‘సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల భేరిలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఢవ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘ సమైక్యఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది.. కర్నూలులో సభ అంటే లక్షలాది మంది జనం తరలివచ్చారు. అయితే దీన్ని హైదరాబాద్‌లో జరిగిన సభలో ఓ నాయకుడు (కేసీఆర్) అపహాస్యం చేస్తూ మాట్లాడారు. గడ్డితిని, ఈకలు తింటూ చేసేవి ఉద్యమాలా అంటూ హేళన చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఉద్యమం అంటే ఏంటో తెలుస్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇంకా ఉద్యమం తీవ్రమవుతుంది. మీరు బలహీనపడి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సీమాం ధ్రుల అంగీకారం లేకుండా తెలంగాణ రాదు.
తెలంగాణ ప్రకటన చేసి 60రోజులైంది. ముందుకు వెళుతున్నాం అంటున్నారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికి కారణం మా ఉద్యమమే. తెలంగాణ విషయంలో ముందుకు వెళ్లినా ఢిల్లీలో ఆపే శక్తి మాకుంది. మా ఎంపీల మెడలు వంచి తెలంగాణను ఆపుతాం. ఇప్పటి వరకు గాంధీల్లా శాంతియుత ఉద్యమం చేస్తున్నాం. రెచ్చగొడితే మా గుండెల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు బయటకి వస్తారు. మేం సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మీరు సర్దుకుపోయాం అంటున్నాం. ఇప్పుడు మేం సర్దుకుపోతాం కలిసుందాం అంటున్నాం’ అని ఆయన అన్నారు.
అందుకే కాంగ్రెస్‌ను గెలిపించాం
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ విభజన లేనందుకే ఆ పార్టీని గెలిపించామని, విభజన అన్న పార్టీలను ఓడించామని అశోక్‌బాబు గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రంగా ఉంచుతారని నమ్మకంతో ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసగించి తెలంగాణ ప్రకటన చేయడం సరికాదన్నారు. నదీజలాల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఉండడానికి మేమేం అటు ఇటు కాని వాళ్లం కాదు. పార్లమెంటులో బిల్లు పెట్టిన రోజున ఢిల్లీలో మిలియన్‌మార్‌చ చేస్తామని ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు వి.సిహెచ్ వెంగళరెడ్డి అధ్యక్షత వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర నేత చలసాని శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, కర్నూలు జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశ్, పరిపాలన అధికారి సంపత్ కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొని ప్రసంగించారు.