
ప్రధాని నివాసం ముట్టడికి సీమాంధ్ర విద్యార్థుల యత్నం
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వస్తుందన్న సమాచారంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు గురువారం సాయంత్రం ప్రయత్నించారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఊహించని పరిణామంతో వెంటనే తేరుకున్న భద్రత సిబ్బంది.. ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగానే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రధాని నివాసం భద్రత పెంచారు.