నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది అతనే: అశ్విన్
టీమిండియా టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘వాట్ ద డక్2’ చాట్‌షోలో మాట్లాడిన అతను మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడని తెలిపాడు. ‘సెహ్వాగ్ ఎప్పుడు కాంప్లికేటెడ్ కాదు. నిజానికి అతను నాపై ప్రతికూల ప్రభావాన్ని చూపాడు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బశాడు’ అని చెప్పాడు.
‘దంబుల్లాలో ఓ ఘటన జరిగింది. అప్పుడు నెట్స్‌లో నేను వేసిన ప్రతి బంతిని సెహ్వాగ్ అలవోకగా ఎదుర్కొన్నాడు. ఫస్ట్ బాల్ నేను ఔట్‌సైట్ స్టంప్స్ దిశగా వేశాను. సెహ్వాగ్ కట్ చేశాడు. ఆ తర్వాతి బాల్ స్టంప్స్ దిశగా వేశాను. దాన్నీ కట్ చేశాడు. తర్వాతి బాల్ మిడిల్ స్టంప్స్‌కు వేయగా.. దానిని కట్ చేసి వదిలేశాడు. ఆ తర్వాతి బాల్ లెగ్ స్టంప్స్‌కు వేయగా సెహ్వాగ్ అదే రిపీట్ చేశాడు. నాకు ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ఇక చేసేది ఏమీ లేక ఫుల్ బంతి వేశాను. సెహ్వాగ్ ముందుకొచ్చి దానిని సిక్సర్ కొట్టాడు’ అని అశ్విన్ వివరించాడు.
భారత జట్టులో చోటుకోసం అశ్విన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ‘నేను అంత మంచి బౌలర్‌ను కాదేమో. లేకపోతే అతను చాలామంచి ఆటగాడు అయి ఉంటాడని నాకు నేను చెప్పుకున్నాను. నెట్స్‌లో సచిన్‌కు బౌలింగ్ చేసినప్పుడు కూడా నేను ఇంత ఇబ్బంది పడలేదు. కొన్ని రోజులు సెహ్వాగ్‌ను పరిశీలించిన తర్వాత ఒకరోజు ఉండబట్టలేక నేను మెరుగుపడాలంటే ఏం చేయాలని అతన్నే అడిగాను. నేను సచిన్‌ను అడిగి ఉంటే మంచి సలహాలు ఇచ్చేవాడు. ధోనీని అడిగివుంటే దృక్పథం ఎలా ఉండాలో చెప్పేవాడు. కానీ వీరూ.. ‘నేను ఆఫ్ స్పిన్నర్లను బౌలర్లుగా పరిగణించను. వారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేరు. వారిని చితక్కొట్టడం నాకు చాలా సులువు’ అని చెప్పాడు’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని అశ్విన్ వివరించాడు.