టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్‌వుడ్‌తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్‌వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్‌వుడ్‌కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్‌వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.
బ్యాటింగ్‌లో విరాట్ టాప్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.
నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు.
ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment