టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.
మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్‌లో
కాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్‌గా అవతరించాడు.
మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.
సత్తా చాటిన పాక్ స్పిన్నర్లు
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.
సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి
మరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్‌లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-5
1. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు
2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు
3. జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు
4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు
4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.
జైస్వాల్‌కు మూడో ర్యాంకు
ఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment