India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. తొలుత పర్యాటక జట్టును నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. మొత్తానికి మొదటి రోజు ఆటలో రోహిత్ సేన పైచేయి సాధించింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్(35)ను పెవిలియన్‌కు పంపి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. 12వ ఓవర్ ఐదో బంతికి డకెట్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశూ.. అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.
అనంతరం.. 15వ ఓవర్లో రవీంద్ర జడేజా ఒలీ పోప్(1) రూపంలో రెండో వికెట్ అందించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్రాలే(20)ను అశూ అవుట్ చేయగా.. అక్షర్ పటేల్ బెయిర్ స్టో(37)ను బౌల్డ్ చేశాడు.
స్పిన్నర్లకు ఎనిమిది వికెట్లు
జడ్డూ మరోసారి విజృంభించి జో రూట్(29) వికెట్ పడగొట్టగా.. అక్షర్ ఫోక్స్(4) రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా రెహాన్ అహ్మద్(13), జడ్డూ హార్ట్లే(23), అశూ మార్క్ వుడ్(11) వికెట్లు తీశారు. ఆఖరి వికెట్‌గా కెప్టెన్ బెన్‌స్టోక్స్(70) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవలియన్ చేరాడు.
దీంతో 64.3 ఓవర్ల వద్ద 246 పరుగులకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లలో అశ్విన్‌కు మూడు, జడేజాకు మూడు, అక్షర్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కగా.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
జైస్వాల్ దూకుడు
ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధనాధన్ బ్యాటింగ్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా ఎదుర్కొన్న 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, దూకుడుగా ఆడాలని భావించిన రోహిత్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 27 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేసిన అతడు జాక్ లీచ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్ గిల్ 43 బంతుల్లో 14 పరుగులతో ఆడుతున్నాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 23 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. జైస్వాల్, గిల్ క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment