రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అశ్విన్ తన 98వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అశ్విన్ 500 వికెట్లు సాధించే క్రమంలో 34 వికెట్ల ఘనతలు, ఎనిమిది 10 వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అశ్విన్ అత్యుత్తమ గణాంకాలు 7/59 (ఇన్నింగ్స్), 13/140గా (మ్యాచ్) ఉన్నాయి.
అశ్విన్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అశ్విన్‌కు ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు) 500 వికెట్ల మార్కును తాకాడు. ఓవరాల్‌గా అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల రికార్డు లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) పేరిట ఉంది. ఈ జాబితాలో షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (696), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్(563), వాల్ష్ (519), నాథన్ లయోన్(517) అశ్విన్‌కు ముందు ఉన్నారు.
అశ్విన్ సాధించిన మరిన్ని రికార్డులు..
- బంతుల పరంగా అత్యంత వేగంగా (25714) 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ (25528) అశ్విన్ కంటే ముందున్నాడు.
- మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా (98) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో మురళీథరన్ (87 టెస్ట్‌లు) టాప్‌లో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. 445 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 19 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 109 పరుగులు చేసింది. జాక్ క్రాలే 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. బెన్ డకెట్ (77), ఓలీ పోప్ (16) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment