సెల్ఫీల పిచ్చోళ్లు.. విగ్రహం విరగ్గొట్టేశారు!
ఇటీవలి కాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అది కాస్తా చివరకు విగ్రహాలు విరగ్గొట్టేవరకు వెళ్తోంది. ఉత్తర ఇటలీలో కొంతమంది పర్యాటకులు ఇదే పని చేశారు. ఎప్పుడో 1700 సంవత్సరం నాటి హెర్క్యులెస్ విగ్రహాన్ని వాళ్లు విరగ్గొట్టేశారు. విగ్రహం మీదకు ఎక్కి మరీ సెల్ఫీ తీసుకోడానికి కొంతమంది పర్యాటకులు ప్రయత్నించడంతో అది కాస్తా విరిగిపోయింది. ఈ ఘటన క్రెమోనాలో శుక్రవారం రాత్రి జరిగింది. విగ్రహం పైనున్న పాలరాతి కిరీటం విరిగి కింద పడిపోయింది.
ఇలా విగ్రహాన్ని విరగ్గొట్టిన ఇద్దరు పర్యాటకులను పోలీసులు గుర్తించినట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ విగ్రహంలో రెండు హెర్క్యులెస్ విగ్రహాలు ఒక పెద్ద షీల్డును పట్టుకుని ఉంటారు. క్రెమోనా నగరానికి ఇది ఓ సింబల్లా ఉంటుందని చెబుతారు. ఈ విగ్రహ నిర్మాణం 1700 సంవత్సరంలో పూర్తయింది. 1962లో దీన్ని ఇపుడున్న ప్రదేశానికి మార్చారు.