జీడీపీ జోష్‌తో మార్కెట్లు డబుల్ సెంచరీ
ముంబై: జీడీపీ గణాంకాల జోష్‌తో దేశీయస్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచే పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు డబుల్ సెంచరీ సాధించి జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక పురోగతి అంచనాలను మించడంతో ప్రస్తుతం సెనెక్స్ 223 పాయింట్లు ఎగిసి 28,967 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 8939 వద్ద కొనసాగుతున్నాయి. దలాల్ స్ట్రీట్ ఊహించిన దానికంటే మూడవ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 8,950ని అధిగమించేందకు సిద్ధంగా ఉంది.
క్యూ3లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7 శాతం వృద్ధి సాధించడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గత రెండు నెలల్లో (డిసెంబర్ మరియు జనవరి) లో రూ. 14,000 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోళ్లు మార్కెట్‌కు ఊతమిచ్చాయంటున్నారు. మదుపర్ల కొనుగోళ్లతో దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లులాభాలకు తోడు రియల్టీ, మెటల్, బ్యాంక్ నిఫ్టీ కూడా లాభపడుతున్నాయి. ఇన్‌ఫ్రాటెల్, యాక్సిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, హిందాల్కోలాభాల్లోనూ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐడియా, ఎంఅండ్‌ఎం, అంబుజా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
అటు పసిడి బులియన్ మార్కెట్లో వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా నే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.191 క్షీణించి రూ.29,375 వద‍్ద ఉంది. రూపాయి కూడా 0.16పైసలు నష్టపోయి రూ.66.85 వద్ద వుంది.