లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు
Published Tue, Nov 8 2016 9:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
ఆటో, ఐటీ స్టాక్స్ మద్దతుతో పాటు, అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 89.69 పాయింట్ల లాభంతో 27,548గా కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ సైతం 26.20 పాయింట్ల లాభంతో 8,523 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ మార్కెట్లో లాభాలు పండిస్తుండగా.. హెయూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్లు మేజర్ సెన్సెక్స్ లూజర్లుగా ఉన్నాయి. ప్రారంభంలో 126.94 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 27,600 గరిష్ట స్థాయిని, 27,503 కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం ప్రారంభంలో 8,543.15 గరిష్టస్థాయి, 8,515.20 కనిష్ట స్థాయిల్లో నడిచింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల్లే మిగిలి ఉన్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలు పెరిగి అటు ఆసియన్ మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. హిల్లరీ ఆశావహంతో పెట్టుబడిదారులు భారీ మొత్తంలో కొనుగోలు చేపడుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకం వ్యవహారంపై ఎఫ్బీఐ హిల్లరీకి క్లీన్ చీట్ ఇవ్వడంతో మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొంటున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి 1 అనంతరం ఇవే అతిపెద్ద లాభాలు. డోజోన్స్ 2.08 శాతం, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 2.22 శాతం, నాస్డాక్ కాంపొజిట్ 2.37 శాతం జంప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 494 రూపాయల నష్టంతో 30,063గా కొనసాగుతోంది.
Advertisement
Advertisement