హిల్లరీకి క్లీన్‌చిట్: భారీలాభాల్లో స్టాక్ మార్కెట్లు
Published Mon, Nov 7 2016 9:50 AM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు క్రిమినల్ నేరారోపణల నుంచి భారీ ఊరట కల్పిస్తూ.. ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇన్నిరోజులు నష్టాల్లో నడిచిన దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక్కసారిగా భారీ లాభాల్లో ఎగిశాయి. 280 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 239 పాయింట్ల లాభంతో 27,513వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 77 పాయింట్ల లాభంతో 8510గా ట్రేడ్ అవుతోంది. హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ వాడకంపై పునఃవిచారణ చేపట్టిన ఎఫ్బీఐ, అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశలో ఆమెకు భారీ ఊరటనిచ్చింది. నేరారోపణల నుంచి హిల్లరీని బయటపడేసింది. దీంతో ట్రంప్ గెలుస్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది. ట్రంప్ గెలుపు అవకాశాలతో ఆటుపోట్లకు గురైన స్టాక్ మార్కెట్లు ఎఫ్బీఐ ప్రకటనతో మళ్లీ హిల్లరీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి.
దీంతో అటు అమెరికన్ స్టాక్ మార్కెట్లు, ఇటు ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ ప్రకటనతో మెక్సికన్ పెసో భారీగా లాభపడింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత విధానాలు ఆ దేశానికి ప్రతికూలంగా మారాయి. ఎఫ్బీఐ క్లీన్ చీట్తో హిల్లరీ గెలుపుకు మళ్లీ అంచనాలు బలపడి, మెక్సికన్ పెసో 1-1/2 వారాల గరిష్టానికి జంప్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లుపిన్ 7 శాతం పెరిగింది, అదేవిధంగా సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ లాభాల్లో నడుస్తున్నాయి. బలమైన క్యూ2 ఫలితాలతో పీఎన్బీ షేర్ 5 శాతం ఎగిసింది. అయితే దేశీయ కరెన్సీ రూపాయి, డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే 4 పైసలు బలహీనపడింది. శుక్రవారం 66.70గా ముగిసిన రూపాయి, నేటి ట్రేడింగ్లో 66.74గా ప్రారంభమైంది. అమెరికా ఎకనామిక్ డేటా, డాలర్ ఇండెక్స్ రూపాయి బలపడటానికి సహకరించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Advertisement