రెండేళ్ల గరిష్టంలో నిఫ్టీ
Published Mon, Mar 6 2017 4:18 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
ముంబై : డబుల్ సెంచరీని క్రాస్ చేసిన సెన్సెక్స్ 29వేల మార్కును పునరుద్ధరించుకుంది. 215.74 పాయింట్ల లాభంలో 29048.19 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం రెండేళ్ల గరిష్టంలో 8950పైకి 65.90 పాయింట్ల లాభాలోకి ఎగిసింది. ఐటీ, ఫార్మా మినహా మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాలు పండించాయి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం మేర పైకి దూసుకెళ్లింది. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియోపై చార్జీలు వసూలు చేయనుందనే నేపథ్యంలో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో కంపెనీ రూ.100,000 కోట్ల రెవెన్యూలను ఆర్జించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో హెచ్1-బీ వీసా ప్రక్రియపై సరియైన స్పష్టత రాకపోతుండటంతో ఐటీ సెక్టార్ సోమవారం మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రోలు నష్టాలు గడించాయి. వాటితో పాటు ఫార్మా కంపెనీలు సన్ ఫార్మా, గ్రాసిమ్ షేర్లు కూడా ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.11 పైసల లాభంతో 66.70గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.29,096గా ట్రేడైంది.
Advertisement