
థాయ్‌లాండ్ రిసార్టులో వరుస పేలుళ్లు
థాయ్‌లాండ్‌లోని హువాహిన్ రిసార్టు సమీపంలో రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. దాంతో నలుగురు మరణించగా దాదాపు 20 మందివరకు గాయపడినట్లు థాయ్ పోలీసులు తెలిపారు. థాయ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నాడు అక్కడ సెలవు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో పేలుళ్లు సంభవించాయి. వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్ వద్దకు ఎక్కువ మంది జనం చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాబులు పేలాయి.
దాంతో ఒక థాయ్ మహిళ సహా నలుగురు మరణించగా కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు గాయపడినట్లు స్థానిక డిప్యూటీ పోలీసు చీఫ్ సమీర్ యోసమ్రన్ తెలిపారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు బాంబులు 50 మీటర్ల దూరంలో పేలాయి. బాంబులు ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక గొడవల వల్లే బాంబులు పేలి ఉంటాయని భావిస్తున్నారు. థాయ్ రాజు భూమిబాల్ (88), ఆయన భార్య సిరికిట్ ఇద్దరూ బ్యాంకాక్ ఆస్పత్రిలోనే ఉన్నారు. వాళ్లు కొంతకాలం పాటు హువాహిన్ ప్రాంతంలో కూడా నివసించారు.