కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' (పైవారు ఎవరు కాదు) వినియోగించకుండా 'స్టే' విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా చుక్కెదురైంది. నోటా ఆప్షన్‌పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యసభ ఎన్నికలో 'నోటా' ఆప్షన్‌పై 2014లో సర్క్యలర్ జారీచేస్తే ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించారని కాంగ్రెస్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అధినేత్రి సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అహ్మద్ పటేల్‌ను ఓడించి హస్తాన్ని గట్టి దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరుగురుఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. దీంతో మరింతమంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి శివకుమార్‌పై, గుజరాత్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌పై ఐటీ దాడులు జరగడం కాంగ్రెస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది.