
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం, 19మంది మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందగా, 16 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా కూలీల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి లారీలో సిమెంట్ బూడిదెను విశాఖకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పనులు ముగించుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏలూరు బైపాస్ వద్ద బూడిద లారీలో 35 మంది కూలీలు బయల్దేరారు.
19 రోజుల క్రితం పనుల కోసం వలస కూలీలు చింతలపూడికి వెళ్లి.. రాత్రి చింతలపూడి నుంచి ఏలూరుకు బస్సులో వచ్చారు. ప్రమాద సమయంలో లారీపై కూలీలు గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం తరువాత లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ అయినట్టు పోలీసులు చెప్పారు. లారీ కింద చిక్కుకున్న 35 మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం. అయితే 16 మందిని బయటకు తీసినట్టు పోలీసులు చెప్పారు. నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా, కత్తిపాడు, తొండంగి, అన్నవరం ప్రాంతానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని రాజమండ్రి ప్రభుత్వాసుప్రతికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మృతుల వివరాలు:
గాజు శ్రీనాథ్, నాగేశ్వరపురం
బల్లపల్లి దొరబాబు, విజయపురం
గాదె దొరబాబు, శృంగవరం
కడమి సూరి, విజయపురం.. మరికొంతమంది పేర్లు తెలియాల్సి ఉంది.
కాగా, తూర్పుగోదావరి జిల్లా రోడ్డుప్రమాద ఘటనపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపాన్ని తెలిపారు.