కూటికోసం వెళ్లి.. కాటికి.. | Several died in road accident at Rajamandry | Sakshi
Sakshi News home page

కూటికోసం వెళ్లి.. కాటికి..

Published Tue, Sep 15 2015 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

కూటికోసం వెళ్లి.. కాటికి.. - Sakshi

కూటికోసం వెళ్లి.. కాటికి..

డ్రైవర్ కునికిపాటుతో క్లింకర్ లారీ బోల్తా
16 మంది వలస కూలీల దుర్మరణం
మరో 18 మందికి తప్పిన ప్రాణగండం
♦  తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద దుర్ఘటన
♦  తగిన పరిహారానికి బాధిత కుటుంబాల పట్టు
రాజమండ్రి ఆసుపత్రి ఆవరణలో నిరసన
బంధువుల సంతకాల్లేకుండానే మృతదేహాల తరలింపు
అడ్డొచ్చిన మహిళలనూ లాగిపారేసిన పోలీసులు
లంచం తీసుకుని లారీని వదిలేసిన పెట్రోలింగ్ పోలీసులు


సాక్షి ప్రతినిధి, కాకినాడ/ గండేపల్లి: కూటి కోసం, కూలి కోసం రెక్కల్ని నమ్ముకుని తరలివెళ్లిన వలస కూలీలు తిరుగుప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం... పోలీసులు, రవాణా అధికారుల కాసుల కక్కుర్తి కలగలిసి 16 నిండు ప్రాణాలను గాల్లో కలిపేశాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదంలో 16 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన వారి జీవితాలు నడిరోడ్డుపై అర్ధంతరంగా ముగిసిపోయాయి.

తమవారి రాకకోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు ప్రమాద సమాచారం అశనిపాతమైంది. అయినా తమ వారు ఈ గండం నుంచి తప్పించుకొనే ఉంటారన్న ఆశతో వారివారి తల్లిదండ్రులు, ఇల్లాళ్లు, బంధువులు సంఘటనాస్థలికి పరుగొత్తుకొచ్చారు. అప్పటికే ఆసుపత్రికి తీసుకుపోయారని తెలుసుకొని రాజమండ్రి వెళ్లారు. అక్కడ తమ వారు విగతజీవులుగా కనిపించడంతో హతాశులయ్యూరు. నాలుగు రోజుల్లో తిరిగొస్తామని నవ్వుతూ వెళ్లినవారు ఇప్పుడు తమను నడిసంద్రంలో ముంచేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు రోదించారు. ఇదే ప్రమాదంలో మరో 18 మంది కూలీలు మృత్యుగండం నుంచి త్రుటిలో బయటపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఈ విషాద సంఘటన వివరాలివీ..
 
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉద్ధండ జగన్నాథపురం, రౌతులపూడి మండలం శృంగవరం, శంఖవరం మండలం అచ్చంపేట, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన మొత్తం 36 మంది జామాయిల్ చెట్లు నరికే పనికోసం 20 రోజుల క్రితం కృష్ణా జిల్లాలోని చాట్రాయికి వెళ్లారు. శంఖవరం మండలం కొత్తూరుకు చెందిన రాంబాబు వీరికి మేస్త్రీగా ఉన్నాడు. అయితే నాలుగు రోజులుగా చాట్రాయి పరిసరాల్లో వర్షాలు పడుతుండటంతో పనికి ఆటంకం కలిగింది. దీంతో వారిలో ఇద్దరు కూలి డబ్బులు తెస్తామని ఉండిపోగా మిగతా 34 మంది ఆదివారం సాయంత్రం తిరుగుప్రయాణమయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మీదుగా ఏలూరు చేరుకున్నారు. అక్కడ రాత్రి భోజనం చేసిన తర్వాత బైపాస్‌రోడ్డుకు వచ్చారు. అదేసమయంలో గుంటూరు జిల్లా దాచేపల్లినుంచి విశాఖలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి ముడిసరుకు (క్లింకర్)తో వెళ్తున్న లారీని ఆపి ఎక్కారు. క్లింకర్‌పై కప్పిన టార్పాలిన్‌పై నిద్రకు ఉపక్రమించారు.
 
రూ.300 కక్కుర్తి కొంప ముంచింది...

లోడు లారీపై ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమైనా డ్రైవర్ డబ్బులకు ఆశపడ్డాడు. లారీ కొంతదూరం వెళ్లిన తర్వాత హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆపినా రూ. 300 తీసుకొని లారీని వదిలేశారని ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెబుతున్నారు. అక్కడినుంచి రాజమండ్రి మీదుగా గండేపల్లి వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి 2.15 గంటలైంది. అప్పటికే నిద్రమత్తులో ఉన్న డ్రైవరు స్టీరింగ్‌పై అదుపు కోల్పోవడంతో లారీ జాతీయ రహదారిపై నుంచి పంట పొలాల్లోకి దూసుకుపోయింది.

అయితే రోడ్డు పక్కనున్న మర్రిచెట్ల కొమ్మ లు తగిలి కొంతమంది మేల్కొని కిందికి దూకేశారు. వారి అరుపులతో మేల్కొన్న డ్రైవరు లారీని మళ్లీ రహదారిపైకి మళ్లించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చెయి దాటిపోయింది. వర్షంవల్ల రోడ్డుపక్కనున్న బంకమట్టి జారిపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. లారీ పొలాల్లోకి బోల్తాపడింది. దీంతో 18 మంది క్లింకర్ కింద ఇరుక్కుపోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న జగ్గంపేట పోలీసుస్టేషన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని తొలగింపుచర్యలు చేపట్టారు.
 
జగన్ వస్తున్నారని తెలిసి..: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పోలీసులకు విపక్షనేత జగన్ వస్తున్నారని తెలిసింది. దీంతో తక్షణం మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకుపోవాలని వారి కుటుంబసభ్యులను బలవంతం చేశారు. రూ. 10 లక్షల నష్టపరిహారం ఇచ్చేవరకూ తాము తీసుకెళ్లబోమని వారు తేల్చిచెప్పడంతో పోలీసులు బలప్రయోగానికి దిగారు. మహిళలను సైతం పక్కకు ఈడ్చేశారు. మృతదేహాలతో వాహనాలను హడావుడిగా అక్కడి నుంచి పంపించేశారు.

కనీసం తమ సంతకాలైనా తీసుకోకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని బాధితులంతా నిరసనకు దిగారు. అదే సమయంలో పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన జగన్.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామని హోం మంత్రి చినరాజప్ప చెప్పా రు. మృతుల కుటుంబాల్ని ఆదుకుంటామని, అర్హులుంటే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి యనమల తెలిపారు.
 
వీరు మృత్యుంజయులు
దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తున పేరుకుపోయిన క్లింకర్ కింద మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు, సహాయ సిబ్బంది నానాఅవస్థలు పడ్డారు. క్లింకర్ కింద ఇరుక్కుపోయిన అల్లి దేవుడు, ఈగల శివలను స్థానికుల సాయంతో పోలీసులు క్షేమంగా బయటకు తీశారు. వారితోపాటు తీవ్ర గాయాలైన బళ్ల దుర్గాప్రసాద్, ఈగల సూర్యచంద్రలను హుటాహుటిన రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఎక్కువమందికి క్లింకర్ వేడి కారణంగా శరీరంపై కాలిన గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement