కాల్పులతో దద్దరిల్లిన కైరో మసీదు
కైరో: కైరోలోని రామ్సెస్ స్క్వేర్ వద్దనున్న అల్-ఫతే మసీదు శనివారం కాల్పులతో దద్దరిల్లింది. ఈజిప్టు సైన్యం శుక్రవారం నిరసనకారులపై భారీ స్థాయిలో విరుచుకుపడిన దరిమిలా, చిన్నారులు, మహిళలు సహా పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ మద్దతుదారులు ఈ మసీదులో తలదాచుకున్నారు. ఈజిప్టు బలగాలు బలప్రయోగంతో మసీదులో తలదాచుకున్న వారిని శనివారం సాయంత్రం బయటకు తరలించాయి. బాష్పవాయు గోళాలను ప్రయోగించి, మసీదులోకి చొచ్చుకుపోయిన బలగాలు, లోపల ఉన్న వారందరినీ తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భద్రతా బలగాలు శనివారం ఉదయం నుంచే మసీదును ముట్టడించి, నిరసనకారులతో చర్చలకు విఫలయత్నం చేశాయి. మసీదు లోపల ఉన్న నిరసకారులు, అక్కడి నుంచే బయట ఉన్న బలగాలపై కాల్పులు జరపడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మరోవైపు ముర్సీకి మద్దతుగా ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ను చట్టబద్ధంగా రద్దుచేయాలని ఈజిప్టు తాత్కాలిక ప్రధాని హజేమ్ ఎల్ బెబ్లావీ ప్రతిపాదించారు. కాగా, భద్రతా బలగాలు శుక్రవారం జరిపిన కాల్పుల్లో మరణించిన వారిలో ముస్లిం బ్రదర్‌హుడ్ సీనియర్ నేత మహమ్మద్ బదీ కుమారుడు అమ్మర్ బదీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులు వరుస నిరసనలకు ముస్లిం బ్రదర్‌హుడ్ శనివారం పిలుపునిచ్చింది.
అల్‌కాయిదా అధినేత అల్ జవహరీ సోదరుడి అరెస్టు...
అల్‌కాయిదా అధినేత ఏయ్‌మాన్ అల్-జవహరీ సోదరుడు మహమ్మద్ అల్-జవహరీని ఈజిప్టు బలగాలు అరెస్టు చేశాయి. పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతు ఇస్తున్నందున అతడిని గిజా చెక్‌పాయింట్ వద్ద అరెస్టు చేసినట్లు ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.