బాలీవుడ్ బాద్షాకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ఆదాయం డిక్లరేషన్ పథకం(ఐడీఎస్) లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి విదేశీ సంస్తల్లో పెట్టుబడులు తదితర ఆదాయ వివరాలను ప్రకటించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఉన్న అప్రకటిత ఆస్తుల వివరాలను అందించాలని కోరింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 131 ఈ ఆదేశాలు జారీ చేసింది.
భారతీయులకు సంబంధించిన అనేకమంది ప్రముఖుల విదేశీ అప్రకటిత ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ శాఖ మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఈ తరహా నోటీసులు జారీచేసినట్టు సమాచారం. అయితే ఐటీ నోటీసులుపై బాద్ షా బిజినెస్ మేనేజర్, రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్ కో ప్రొడ్యూసర్ కరుణ బద్వాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఐడీఎస్ పథకం విజయవంతం కోసం ప్రభుత్వం భారీ ఎత్తున కృషి చేస్తోందని.. అప్రకటిత ఆస్తులను వెల్లడి చేయని వారి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందనే సందేశాన్ని పంపుతోందని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దిలీప్ లాఖానీ వ్యాఖ్యానించారు. అయితే ఐటీ నిబంధనలను షారూక్ ఉల్లంఘించారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, గత ఏడాది మే నెలలో కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై నోటీసులు ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే