మహిళా కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: సీపీఎం మద్దతుదారుడు, పత్రికా విశ్లేషకుడు చెరియాన్ పిలిప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ల కోసం కొందరు మహిళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రహస్యంగా అర్థనగ్న (షర్ట్ లెస్) నిరసనలు తెలిపి చివరికి టికెట్లు పొందరాని ఆరోపించి వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత ఏకే ఆంటోనికి మాజీ కీలక సహచరుడిగా ఉన్న పిలిప్ అనంతరం కొన్ని విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లి సీపీఎం పార్టీలో చేరారు.
త్రిశూర్ లో వచ్చే నవంబర్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఉద్దేశించి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆయన అందులో.. 'ఇటీవల త్రిశూర్లో వచ్చే నవంబర్లో జరగనున్న స్థానిక ఎన్నికల కోసం సీట్లు ఇవ్వలేదని కొందరు యువ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్ధులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. గట్టిగా అరుస్తూ రహస్యంగా అర్ధనగ్న ఆందోళన నిర్వహించి చివరకు టికెట్లు సాధించారు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపట్ల మహిళ సంఘం నేతలు, ఇతర పార్టీ పెద్దలు, మహిళా హక్కుల నేతలు భగ్గుమన్నారు. దీంతో ఆయన ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు.
అందులో తాను మహిళలకు వ్యతిరేకిని కాదని, అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తానెప్పుడూ మహిళలను గౌరవిస్తానని, పురుషుల ఆధిపత్యం కొనసాగుతుందని, మహిళలను అణిచివేస్తున్నారనే చెప్పానన్నారు. మరోపక్క, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ కూడా పిలిప్ వ్యాఖ్యలపట్ల మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు. సీపీఎం సీనియర్ నేత రాజా, ఐద్వా నేత టీఎన్ సీమా కూడా పిలిప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.