లోక్‌సభలో శివసేన రగడ | Shiv Sena MP Ravindra Gaikwad claims innocence in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో శివసేన రగడ

Published Fri, Apr 7 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

లోక్‌సభలో శివసేన రగడ

లోక్‌సభలో శివసేన రగడ

ఎంపీ గైక్వాడ్‌పై విమాన ప్రయాణ నిషేధం ఎత్తేయాలని డిమాండ్‌
మంత్రి అశోక్‌ గజపతి రాజు ఘెరావ్‌
జోక్యం చేసుకున్న రాజ్‌నాథ్, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌


లోక్‌సభలో శివసేన ఎంపీలు వీరంగం సృష్టించారు. ఆ పార్టీ ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమాన ప్రయాణ నిషేధం ఎత్తేయాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభలోనే అంతా కలసి విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి(శివసేన ఎంపీ) అయిన అనంత్‌ గీతే కూడా వీరితో గళం కలపడం ఆశ్చర్యానికి గురిచేసింది. భద్రత విషయంలో రాజీ పడేది లేదన్న గజపతిరాజును శివసేన ఎంపీలు చుట్టుముట్టి నినాదాలతో పాటు ఘెరావ్‌ చేశారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్, హోం మంత్రి రాజ్‌నాథ్‌ కలగజేసుకుని ఇరువర్గాలతో భేటీ అయి శాంతింపజేశారు.

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమాన ప్రయాణ నిషేధం ఎత్తేయాలంటూ ఆ పార్టీ ఎంపీలు గురువారం లోక్‌సభ కార్యక్రమాలను అడ్డుకున్నారు. కేంద్రంతోపాటుగా విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుపై  విరుచుకుపడ్డారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. కేంద్ర మంత్రి (శివసేన ఎంపీ) అనంత్‌ గీతే ఈ నిరసనలో గళం కలిపారు. మంత్రి అశోక్‌ దగ్గరకు వెళ్లిన ఎంపీలు నినాదాలు చేశారు. వీరి డిమాండ్‌కు మంత్రి స్పందించకపోవటంతో ఆగ్రహించిన ఎంపీలు మంత్రిని ఘెరావ్‌ చేశారు.

 హోం మంత్రి రాజ్‌నాథ్‌ జోక్యం చేసుకుని శివసేన ఎంపీలను, మంత్రి గీతేను పక్కకు తీసుకెళ్లారు. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం త్వరలోనే లభిస్తుందని తెలిపారు. మంత్రి అశోక్‌ మాట్లాడుతూ.. ‘విమానాల్లో ప్రయాణికుల భద్రతముఖ్యం. భద్రత విషయంలో రాజీ పడేది లేదు’ అని అన్నారు. దీనికి మంత్రి గీతే స్పందిస్తూ.. ‘ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్ణయం అవమానకరం’ అని అన్నారు. మంత్రిపై శివసేన సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నాకు న్యాయం చేయండి: గైక్వాడ్‌
అనంతరం గైక్వాడ్‌ మాట్లాడుతూ.. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన తీరును వివరిస్తూ.. ఎయిరిండియా ఉద్యోగి తనను రెచ్చగొట్టేలా మాట్లాడినందునే ఆయన్ను తోసేశానన్నారు. ‘నీ హోదా ఏంటని ఉద్యోగిని అడిగితే.. ఎయిరిండియా కా బాప్‌ అని బదులిచ్చాడు. నేను ఓ ఎంపీని అని చెబుతుండగానే.. నువ్వేమైనా నరేంద్ర మోదీవా అని నన్నే తిరిగి ప్రశ్నించి నన్ను తోశాడు.

 అందుకే నేనూ తోసేయాల్సి వచ్చింది’ అని గైక్వాడ్‌ లోక్‌సభలో తెలిపారు. పోలీసు విచారణలోనే తను తప్పుచేయలేదనే విషయం తేలుతుందన్నారు. అనంతరం శివసేన నేతలను మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయకపోతే ఏప్రిల్‌ 10న జరగనున్న ఎన్డీయే ఎంపీల సమావేశానికి హాజరుకామని ప్రకటించారు. ఇది పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశమని స్పష్టం చేశారు.

 ‘వేర్పాటువాదులు, రేపిస్టులు, ఉగ్రవాదులు యథేచ్ఛగా విమానాల్లో తిరుగుతుంటే.. ఓ ఎంపీకి ఎందుకు అవకాశం ఇవ్వర’ని ప్రశ్నించారు. మంత్రి అశోక్‌పై శివసేన ఎంపీలు తప్పుగా ప్రవర్తించలేదని మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. మరోవైపు, శివసేన ఎంపీల ఆందోళన నేపథ్యంలో ఎయిరిండియా కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ముంబై, పుణే విమానాశ్రయాల్లో ఉద్యోగుల భద్రతను కట్టుదిట్టం చేశారు.

గైక్వాడ్‌ క్షమాపణ లేఖ
ఎయిరిండియా ఉద్యోగిపై దాడి కేసులో విమానప్రయాణ నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌.. కాస్త వెనక్కు తగ్గారు. మార్చి 23నాటి ఘటన దురదృష్టకరమని.. దీనికి క్షమాపణలు కోరుతున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు లేఖ రాశారు. ‘సమస్యను తీవ్రతరం చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అనుకోకుండా ఆ ఘటన జరిగింది. దీనిపై విచారణలోనే వాస్తవాలు తేలుతాయి. విమాన ప్రయాణంలో నిషేధం వల్ల నా బాధ్యతలను నిర్వహించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందువల్ల నాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయండి. విచారణ కొనసాగించండి’ అని గైక్వాడ్‌ లేఖలో పేర్కొన్నారు.

 స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో శివసేన, టీడీపీ ఎంపీల సమావేశం అనంతరం గైక్వాడ్‌ ఈ లేఖ రాశారు. దీనికి మంత్రిత్వ శాఖ అధికారులు సమాధానమిస్తూ.. ‘మొదట్నుంచీ మేం ఎంపీ గైక్వాడ్‌ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఇప్పుడు క్షమాపణ లేఖ అందింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన తెలిపారు. దీన్ని పరిశీలిస్తున్నాం’ అని వెల్లడించారు. అయితే ఇంకా నిషేధం ఎత్తివేయటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎయిరిండియా స్పష్టం చేసింది.

విమానాల్లో ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యం. భద్రత విషయంలో రాజీ పడేది లేదు.
– విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు

వివాదం జరిగిన రోజు.. నీ హోదాఏంటని ఉద్యోగిని అడిగితే.. ఎయిరిండియా కా బాప్‌ అని బదులిచ్చాడు. నేను ఓ ఎంపీని అని చెబుతుండగానే.. నువ్వేమైనా మోదీవా అని నన్నే తిరిగి ప్రశ్నించి నన్ను తోశాడు. అందుకే నేనూ తోసేయాల్సి వచ్చింది.    – ఎంపీ గైక్వాడ్‌
ఉద్యోగిపై దాడి కేసులో గైక్వాడ్‌ క్షమాపణ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement