ఇది ప్రజల విజయం: శివరాజ్ సింగ్
తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్లే మరోసారి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మధ్యప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
శాసనసభలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్తో కలసి ఆదివారం బోపాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు ఆయన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాజపాయి, ఎల్ కే. అద్వానీ, రాజనాథ్ సింగ్ తదితర నేతలకు కృతజ్ఞతులు తెలిపారు. బీజేపీ పార్టీ పెద్దల సహాయ సహకారాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
అందుకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు అందించాలని ఆయన మధ్యప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో ఒక పార్టీకి చెందిన ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. చౌహాన్పై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్దికి అసలుసిసలు చిరునామా చౌహాన్ అని అనంతకుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చౌహాన్ చేపట్టిన విధానాలే ఆయన్ని మరోసారి సీఎం పీఠాన్ని కూర్చోబెట్టనున్నాయని ఆయన కితాబు ఇచ్చారు. దేశంలో మధ్యప్రదేశ్ను అగ్రస్థానంలో ఉంచేందుకు చౌహాన్ విశేష కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. సుపరిపాలనకు చౌహాన్ చిరునామా అని అభివర్ణించారు.