మద్యం మానేసి ఆరేళ్లయిందోచ్: గాయని
కొన్నేళ్ల కిందటి వరకు మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయి.. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రముఖ పాప్ గాయని సియా.. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిపింది. తను మద్యం తాగడం మానేసి ఆరేళ్లయిందని, కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతుతోనే తాను ఈ విషయంలో ఆత్మనిగ్రహంతో నిష్ఠగా ఉంటున్నట్టు 40 ఏళ్ల ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్ లో వెల్లడించింది. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఆస్ట్రేలియా గాయని అయిన సియా 2014లో విడుదల చేసిన 'షాండిలియర్' పాప్ సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ ఏడాది 'చీప్ థ్రిల్స్' పాటతో అభిమానుల్ని పలుకరించిన ఈ అమ్మడు.. పాప్ సింగర్ గా అంతగా వెలుగులోకి రాకముందు నుంచే తను మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయినట్టు వెల్లడించింది.
'నేను పది, పదిహేను ఏళ్లుగా సింగర్ గా ఉన్నాను. సక్సెస్ రాకముందే నేను బాగా మద్యం తాగేదాన్ని. డ్రగ్స్ కు బానిస అయ్యాను. ఇక ఆర్టిస్టుగా ఉండకూడదని మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. చిన్నచిన్నగా పేరుప్రఖ్యాతలు వస్తున్న సమయంలోనే జీవితంలో ఇలా అస్థిరతకు లోనయ్యాను. అయినా, ఆ సమయంలో పాప్ మ్యూజిక్ నుంచి ఎందుకు బయటకిరాలేదంటే అది మిస్టరీయే అనుకుంటా' అని ఆమె ఇటీవల ఓ టీవీషోలో వెల్లడించింది.
'షాండిలియర్' పాటలోని దృశ్యం