సీఎం కావాలనే డిప్యూటీ సీఎం ఆఫర్ వద్దన్నారు
గురుదాస్‌పూర్: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆఫర్ చేశామని, అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలబెడతామని హామీ ఇవ్వడంతో ఆయన తమ ఆఫర్‌ను తిరస్కరించారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
'కాంగ్రెస్ తరపున సిద్ధూ అప్రకటిత సీఎం అభ్యర్థన్న విషయం అందరికీ తెలుసు. అందువల్లే ఆయనకు ఆప్ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా తిరస్కరించారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండరు. మా అభ్యర్థి ఉదయం 11 గంటలకు కాదు 5-6 గంటలకే నిద్రలేస్తారు. రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారు. ప్రజలు కలవాలనుకున్నప్పుడు వారికి అందుబాటులో ఉంటారు' అని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని వెల్లడించలేదు. సరైన సమయంలో ప్రకటిస్తామని చెప్పారు.