'సిద్ధూకి నేను ఎలాంటి కండిషన్లు పెట్టలేదు'
న్యూఢిల్లీ: తమ పార్టీలో చేరేందుకు లెజెండరీ మాజీ క్రికెటర్, ఒకప్పటికీ బీజేపీ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు ఎలాంటి ముందస్తు షరతులు పెట్టలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆయనలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం నిజంగా తమకు దక్కిన గొప్ప గౌరవం అని చెప్పారు. సిద్ధూ చేసిన డిమాండ్ కు ఒప్పుకోకపోవడమే కాకుండా ఆయనకు కొన్ని షరతులు విధించడంవల్లే ఇంకా ఆప్లో చేరే విషయంలో సిద్దూ ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం ట్విట్టర్ లో స్పందించారు. ఆయన చేరికపై పార్టీ అభిప్రాయం ఏమిటో తెలియజేయడం తన బాధ్యత అని అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అలాగే, ఆలోచించుకునేందుకు సిద్ధూకు కొంత సమయం అవసరం అని తెలిపారు.
'నవజ్యోత్ సింగ్ సిద్ధూజీ ఆప్ లో చేరుతున్నాడా అనే విషయంపై ఎన్నో వదంతులు?మా పార్టీ ఈ విషయంలో మాపార్టీ ఏమనుకుంటుందో ఆయనకు చెప్పడం నాబాధ్యత. క్రికెట్ లెజెండ్ మా పార్టీలో చేరేందుకు రావడం మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. గత వారం అతను నన్ను కలిశాడు. నేను ఎలాంటి ముందస్తు షరతులు పెట్టలేదు. ఆయనకు ఆలోచించుకునేందుకు కొంత సమయం కావాలన్నారు. దాన్ని గౌరవిద్దాం. ఆయనొక గొప్ప వ్యక్తి. క్రికెట్ లెజెండ్ కూడా. మా పార్టీలో చేరినా చేరకపోయినా ఆయనపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది' అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
వచ్చే పంజాబ్ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు తీసుకురావాలన్న సిద్ధూ డిమాండ్ తో ఆప్ విభేదించిందని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ మేరకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క, కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధూకోసం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.