ఒక్లాహోమా: అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో ఆదివారం భారీ భాకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయినట్లు యూఎస్ భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. నగరానికి ఈశాన్య దిశగా 50 మైళ్ల దూరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. భూకంప కేంద్రానికి చేరువలో ఉన్న కుషింగ్ పట్టణం ప్రకంపనల ధాటికి కుదేలైనట్లు తెలిసింది.
పెద్ద మొత్తంలో భవనాలు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. గత కొద్ది నెలలుగా ఒక్లహోమాలో భూకంపాలు సంభవించడం పెరిగింది. దాదాపు 4.5 తీవ్రతతో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు.