ట్రంప్ రాకతో జుకర్బర్గ్ సంపద ఢమాల్!
ట్రంప్ రాకతో జుకర్బర్గ్ సంపద ఢమాల్!
Published Thu, Dec 8 2016 7:01 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించనిభరితంగా డొనాల్డ్ ట్రంప్ విజయం.. ఆ విజయంలో ఫేస్బుక్ పాత్రంటూ పలు ప్రచారాలు జరిగాయి. అయితే ట్రంప్ విజయంలో తమ ప్రమేయమేమీ లేదని ఆ వార్తలను ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఖండించారు. ఈ ఖండనలే మార్క్ జుకర్బర్గ్కు అసలు చిక్కు తెచ్చిపెట్టాయి. ట్రంప్ గెలిచినప్పటి నుంచి జుకర్బర్గ్ నికర సంపద దాదాపు 3.7 బిలియన్ డాలర్లు( రూ.24,939 కోట్లు) కిందకి పడిపోయిందట. ఇంతమొత్తంలో జుకర్బర్గ్ సంపద తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, ఆయన ఇంకా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ధనికుడిగానే పేరొందుతున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలినీయర్ల రియల్ టైమ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆయన సంపద 49 బిలియన్ డాలర్లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం రూ.3,30,137 కోట్లు.
అయితే జుకర్బర్గ్కు భిన్నంగా ఇతర అమెరికన్ బిలీనియర్ల సంపద మాత్రం ట్రంప్ ఎన్నికైన దగ్గర్నుంచి విపరీతంగా ఎగిసింది. ట్రంప్ గెలుపు అనంతరం 14 మంది అమెరికన్ ధనికులు తమ నికరసంపదకు అదనంగా 9.4 బిలియన్ డాలర్లను చేర్చుకున్నట్టు తెలుస్తోంది. వారిలో ఎక్కువగా లబ్దిపొందింది వారెన్ బఫెటేనట. ఆయన అధినేతగా ఉన్న బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజ షేర్లు 8 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ నెలలో ఆయన నికర సంపదలో మరో 7 బిలియన్ డాలర్లను పెంచుకున్నారట.
ప్రస్తుతం వారెన్ బఫెట్, ప్రపంచ అత్యధిక ధనవంతుల్లో మూడో స్థానంలో ఉన్నారు. ట్రంప్ విజయం అనంతరం ఫేస్బుక్ కోల్పోతున్న స్టాక్ పతనం కేవలం ఫేక్ న్యూస్ వివాదం వల్ల మాత్రమే కాదని, అక్టోబర్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ఈ షేర్లు ఇటీవల పతనానికి గురవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇతర టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్లు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయట. ఏదైంతేనే ట్రంప్ విజయం జుకర్బర్గ్ను భారీగానే దెబ్బతీసిందని వాదిస్తున్న వాళ్లూ ఉన్నారు.
Advertisement
Advertisement