చైనా గోడపై గిరిజన బాలిక | Sireesha selected to the national Volleyball team | Sakshi
Sakshi News home page

చైనా గోడపై గిరిజన బాలిక

Published Thu, May 18 2017 4:06 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

చైనా గోడపై గిరిజన బాలిక

చైనా గోడపై గిరిజన బాలిక

► జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన శిరీష
►తల్లి ఒకప్పటి మావోయిస్టుల దళ సభ్యురాలు
►తండ్రి లేకపోయినా అంచెలంచెలుగా జాతీయ స్థాయికి
►దేశం తరన చైనాలో ప్రాతినిధ్యం



మల్కన్‌గిరి: ఒకప్పుడు ఆడ పిల్లలు గడపదాటి బయట కాలు పెట్టాలంటేనే ఎన్నో ఆంక్షలు. మరి సాధారణంగానే అభివృద్ధికి ఆమడ దూరంలో.. సంప్రదాయాల సుడిగుండాల్లో నిత్యం బతికే గిరిజన బాలికలు అయితే..? ఇక సరే సరి. వీటన్నీంటికి తోడు అన్ని రంగాల్లో వెనుకంజలో ఉన్న ఒడిశా రా  లో క్రీడలకు అసలు గుర్తింపే లేదు. అయితే.. చైనా గోడలాంటి ఈ ఆంక్షలన్నీంటినీ ఛేదించుకుని సగర్వంగా నిలిచింది ఓ గిరిజన బాలిక. నిత్యం మావోయిస్టుల అలజడులు, బాంబు చప్పుళ్లను బేఖాతరు చేస్తూ.. జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైంది శిరీష కార్తమ(15).

 ఈమె ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10కి పైగా పతకాలు పొందింది. వీటితో పాటు ఇటీవల కేరళలోని ఎర్నాకుళంలో అంతరాష్ట్ర వాలీబాల్‌ టోర్నీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు పొందింది. ఈ టోర్నీలో పతకంతో పాటు వచ్చే నెల చైనాలో జరగనున్న అంతర్జాతీయ జూనియర్‌ వాలీబాల్‌ పోటీలో పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.


మన్యంలో మాణిక్యం
మల్కన్‌గిరి జిల్లా పేరు చెబితే చాలు.. నిత్యం ఇనుపబూట్ల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి ప్రాంతంలో మట్టిలో మాణిక్యంలా పుట్టింది శిరీష. చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి పోయినా తల్లి సహకారంతో అంచలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని జాతీయ శిక్షణా శిబిరానికి ప్రయాణమవుతున్న ఆమె అక్కడ మరింత నైపుణ్యాన్ని పెంచుకోనుంది. తానీ స్థాయికి ఎదగడానికి తల్లి చెల్లిలామ్మ, గురువు జ్ఞానేంద్రబొడాయి కారణమని సగర్వంగా శిరీష చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో అభినందనలతో పాటు నగదు పారితోషికం కూడా అందించారు.

అమ్మ మాజీ నక్సలైట్‌..!
శిరీష ప్రతిభ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచం గుర్తించనట్లే, ఆమె పడ్డ కష్టాలు కూడా అంతగా బయటకు తెలియవు. ఆమె తల్లి చెల్లిలామ్మ ఒకప్పటి నక్సలైటు. చిత్రకొండ, బలిమెళ దళంలో సుమారు 18 ఏళ్లు పని చేసి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ముఖ్యనేతగా ఎదిగింది. అనంతరం వివిధ కారణాలతో 1996లో  పోలీసులకు లొంగిపోయి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి జైలులో 1998 వరకు శిక్ష అనుభవించింది. విడుదల అనంతరం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ మనీష్‌ ముదిగల్‌ చిన్న ఉద్యోగం కల్పించారు.

వివాహానంతరం ఇద్దరు కూతుళ్లు పుట్టాక భారమని చెల్లిలామాను భర్త వదిలేశాడు. అయితే దళంలో అలవడిన ధైర్యం, తెగింపు మరిచి పోలేదేమో! ఇద్దరు కూతుళ్లను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం శిరీష ఉన్నత స్థానానికి ఎదగడం పట్ల పట్టలేని ఆనందంతో ఆమె పరవశించిపోతోంది. బుధవారం శిరీష మహారాష్ట్ర బయలుదేరిన నేపథ్యంలో చెల్లిలామా పుత్రికోత్సాహంతో గర్వంగా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. శిరీషను సాగనంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement