మధ్యాహ్నం నిద్ర ఎంతో మంచిది
లండన్: ‘ ఉదయపు సంధ్య వేళ ఆలోచించడం ఉత్తమం. మధ్యాహ్నం ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం, సాయంత్రం తినడం, రాత్రి నిద్రపోవడం ఉత్తమ లక్షణాలు’ అటు ప్రముఖ ఆంగ్ల కవి, పెయింటర్ విలియం బ్లేక్ ఇచ్చిన సందేశం పూర్తిగా తప్పని వైద్యులు తేల్చారు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు కునుకు తీయడం ఉత్తమమైన విషయమని, అలా చేసినట్టయితే గుండెపోటు అవకాశాలు దాదాపు పది శాతం తగ్గుతుందని వారు స్టెతస్కోప్ సాక్షిగా చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం కునుకు తీస్తే రక్తపోటు నాలుగు శాతం తగ్గుతుందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు వారు తెలిపారు.
లండన్‌లో ఇటీవల ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ నిర్వహించిన ఓ సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. మధ్యాహ్నం నిద్రపోని వారితో పోల్చినట్టయితే నిద్రపోయే వారిలో మధ్యాహ్నం నాలుగు శాతం, రాత్రి ఆరు శాతం రక్తపోటు తగ్గుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఏథెన్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోలిస్ కల్లిస్ట్రేటర్స్ వివరించారు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం వారిలో పది శాతం తగ్గుతుందని ఆయన అన్నారు. తాము 60 ఏళ్ల వయస్సువారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. కునుకు తీయడమంటే కొన్ని నిమిషాలు కాదని, ఓ గంట నిద్రపోతే మంచిదని ఆయన వివరించారు.
కనుక, ఆంగ్ల కవి విలియం బ్లేక్ కవితలు వినాలే తప్ప జీవన శైలికి సంబంధించిన ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రులు విన్‌స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్ మాటలు వినడం బెటర్. ఎందుకంటే మధ్యాహ్నం భోజనానంతరం నిద్రపోవడం వారిద్దరికి అలవాటు. అత్యవసర సమయాల్లో కూడా వారు ఆ అలవాటు మానుకోలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు తనకు నిద్రాభంగం కలిగించకూడదంటూ థాచర్ అధికారికంగా హుకుం కూడా జారీ చేశారట.