రాహుల్ అబద్ధాల కోరు | Smriti Irani questions land sale to Rajiv Gandhi Trust | Sakshi
Sakshi News home page

రాహుల్ అబద్ధాల కోరు

Published Mon, Aug 24 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

రాహుల్ అబద్ధాల కోరు

రాహుల్ అబద్ధాల కోరు

అమేథీలో స్మృతి ఇరానీ విమర్శనాస్త్రాలు
* సైకిల్ ఫ్యాక్టరీ భూమిని రాజీవ్ ట్రస్ట్ ఎలా కొనుగోలు చేసిందని నిలదీత
అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంతగడ్డపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అమేథీలో సైకిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఉన్న భూమిని ఆయన కుటుంబం అధీనంలోని ట్రస్ట్ ఎలా కొనుక్కుందని మండిపడ్డారు. రాహుల్ అబద్ధాల కోరు అని దుయ్యబట్టారు. ఆదివారమిక్కడ జరిగిన సభలో స్మృతి ఇరానీ మాట్లాడారు.

అమేథీ అభివృద్ధి కోసం ఎన్నో హామీలు కురిపించిన గాంధీ కుటుంబం చేతల్లో మాత్రం ఏమీ చేయలేదని ఎద్దేవాచేశారు. సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ కోసం ఉన్న 65 ఎకరాల భూమిని గత ఫిబ్రవరి 24న రాజీవ్‌గాంధీ ట్రస్ట్ కొనుగోలు చేసిందని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ‘80ల్లో సైకిల్ ఫ్యాక్టరీ కోసం రైతుల నుంచి భూమిని తీసుకున్నారు. ఫ్యాక్టరీ రాలేదు. ఒక్క ఉద్యోగమూ రాలేదు.ఈ భూమి ఏమైందని ఏ ఒక్కరూ ధైర్యం చేసి ప్రశ్నించరు. అయితే భూమిని రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేసినట్లు స్టాంప్ పత్రాలుఉన్నాయి’ అని చెప్పారు.

రాహుల్  భూసేకరణ బిల్లుపై మాట్లాడేటప్పుడు రైతుల భూములను ఇతరులు ఒక్క అంగుళమూ తీసుకోవడానికి అనుమతించబోమని చెబుతారు.. అంటే ఆ భూములను తానే స్వయంగా తీసుకుంటానన్నది ఆయన ఉద్దేశమంటూ ఆమె మండిపడ్డారు. స్మృతి ఇరానీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ మూసివేతకు, భూమి కొనుగోలుకు సంబంధమేంటని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా వేలం జరిగిందని, నిరాధార ఆరోపణలు చేస్తూ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement