లండన్ లో కూలిన వృక్షం
అగ్రరాజ్యాలను మంచు తుఫాను గజగజ వణికిస్తోంది. యూకే, అమెరికాలలో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. యూకే వాతావరణంలో ఇంకా మార్పు రాలేదు. బ్రిటన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ లండన్‌లో మినిక్యాబ్‌లో వెళ్తున్న మహిళపై బిల్డింగ్ కూలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఎక్కడికక్కడే సింక్ హోల్స్ ఏర్పడడంతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లల్లోంచి బయటకు రావట్లేదు. వరద పీడిత ప్రాంతాల నుంచి రెస్క్యూ టీమ్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు రంగంలోకి దిగిన ఆర్మీ వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షించే పనిలో పడింది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌లో గంటకు 128 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తుండడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు థేమ్స్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఐర్లాండ్‌లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే లక్షలాది కుటుంబాలు కరెంట్ లేక కష్టాలు పడుతున్నాయి. యూకే, యూఎస్‌లలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
జపాన్‌లో కూడా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ముగ్గురు మృతిచెందగా, సుమారు 850మంది గాయాలపాలయ్యారు. జనజీవనం పూర్తిగా దెబ్బతింది. విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో 26 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. రోడ్డు, రైల్వే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జపాన్‌లో గత 45 ఏళ్లల్లో ఎప్పుడూ లేనట్టు భీకర తుపాను ముంచెత్తింది.
పెరూలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. హువలంగా నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. వరద నీరు ఏరులై పారుతుండడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. 45 ఇళ్లు, 15 బిల్డింగ్స్ పూర్తిగా నాశనమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. పంటలన్నీ నీటిపాలయ్యాయి. మరోవైపు వ్యాధులు ప్రబలే ప్రమాదముండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. మరికొన్ని రోజులు వాతావరణంలో మార్పు ఉండబోదని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉత్తర భారతదేశంలో కూడా హిమపాతం కప్పేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ప్రజాజీవనం స్తంభించిపోతోంది. హిమాచల్‌ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా మంచులో కూరుకుపోయింది. విరామం లేకుండా కురుస్తున్న మంచుతో ఇళ్లు, రహదారులు అన్నీ హిమమయం అయ్యాయి. ఓ వైపు మంచుతో స్థానికులు ఇబ్బంది పడుతుంటే సందర్శకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో తడిసి ముద్దవుతూ ఆనందం పంచుకుంటున్నారు.