ప్రశ్నిస్తే.. టార్గెట్
♦ కర్ణాటకకూ పాకిన టీడీపీ సర్కారు దమనకాండ
♦ ఐటీ ఇంజనీరుకు ఏపీ పోలీసుల నోటీసులు
♦ ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడమే పాపమా?
♦ గొంతెత్తిన నెటిజన్లు
అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నించడం కొందరి నైజం. ఏపీలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై గొంతెత్తినందుకు నగరంలోని ఒక ఐటీ ఇంజనీరును చంద్రబాబు సర్కారు టార్గెట్ చేసింది. ఆయనను, కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసుల నుంచి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై బెంగళూరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సాక్షి, బెంగళూరు: ప్రశ్నించేవారిని తెలుగుదేశం ప్రభుత్వం వేధించడం మానడం లేదు. ఈ విషయంలో వారు రాష్ట్రాల సరిహద్దులను కూడా దాటుతున్నారు. పొలిటికల్ పంచ్ పేరుతో టీడీపీతో పాటు పలుపార్టీల నేతలపై హాస్యస్ఫోరక కార్టూన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రవికిరణ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సర్కారు ఎటువంటి వేధింపులకు గురిచేస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగరీత్య బెంగళూరులో ఉంటున్నారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమాని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు కూడా పెడుతుంటారు. ఇందుకు కర్ణాటక నుంచే కాకుండా ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి కూడా మంచి ఆదరణతో కూడిన స్పందన వస్తోంది.
నోటీసులు.. ఫోన్లలో బెదిరింపులు
అయితే తమ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం తన మార్కు బెదిరింపులకు తెరతీసింది. అందులో భాగంగా ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు ఆయనకు ఫోన్‌చేసి నీ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాన్ని ఊడగొట్టిస్తామని బెదిరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యలను పెద్దసంఖ్యలో నెటిజన్లు తప్పుబడుతున్నారు. వాక్, భావ వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని హరించేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ చర్యలు ఆనాటి జర్మన్ నియంత హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నాయన్నారు.
అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ శ్యాంసుందర్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ...తప్పులను ప్రశ్నిస్తే నోటీసులు జారీ చేయం సరికాదని చెప్పారు. ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు ఎవరూ కూడా భయపడకూడదని తేల్చిచెప్పారు.
- వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ నేత శ్యాంసుందర్‌రెడ్డి