
సోషల్ మీడియా వల్లే హీరోయిన్ ఇంట్లో దోపిడీ?
అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాను ఎక్కడున్నానో.. ఏం చేస్తున్నానో తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు, వివరాలు, స్నాప్‌చాట్‌లో వీడియోలు పెడుతుంది. సరిగ్గా ఇదే అంశం దోపిడీ దొంగలకు బాగా కలిసొచ్చింది. ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ప్యారిస్ పర్యటనలో ఉన్న కిమ్ ఆ విషయాన్ని కూడా అప్‌డేట్ చేస్తూనే ఉంది. దాంతో ఆమె ఉన్న అపార్టుమెంట్ వివరాలు కూడా తెలుసుకున్న దోపిడీ దొంగలు.. ఎంచక్కా అక్కడకు వచ్చారు. దాదాపు రూ. 67 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిపోయారు.
పారిస్‌లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌టబ్‌లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లాల్సిందిగా వేడుకున్నాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్యారిస్‌లో ఒక లగ్జరీ అపార్టుమెంటులో ఉంటున్న కిమ్.. ఆ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతోపాటు ఆమె సోదరి కైల్ జెన్నర్ కొన్ని వీడియోలను కూడా స్నాప్‌చాట్‌లో పెట్టింది. దోపిడీ జరగడానికి కొన్ని గంటల ముందే ఇవి పోస్టయ్యాయి. ఎవరైనా సరే వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని తరచు పోస్ట్ చేస్తున్నా, సంపదను కూడా ప్రదర్శించినా వాళ్ల మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయని ఫ్లోరిడాకు చెందిన అంతర్జాతీయ సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ భాగస్వామి క్రిస్టోఫర్ హాగన్ తెలిపారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలను చెప్పడం సెలబ్రిటీలకు అంత మంచిది కాదని, దానివల్ల వాళ్లు సులభంగా టార్గెట్ అవుతారని అన్నారు. నిజానికి సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువైపోయాయని ఇటీవలే కిమ్ వాపోయింది. తమ భద్రతను కూడా మరింత పెంచుకోవాల్సి ఉంటుందని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ కూడా అన్నారు.