మాజీ ప్రేయసిని చంపబోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
మాజీ ప్రేయసిని చంపబోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
Published Sat, Jan 14 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM
ఇద్దరు ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఒకే ఆఫీసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వమని మాజీ ప్రియుడు అడిగితే.. నీకూ నాకూ కటీఫ్ కాబట్టి ఇక నా నంబర్ ఎందుకు, ఇవ్వబోనని ఆమె తెగేసి చెప్పింది. అతడు ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వచ్చింది. దాంతో ఒక్కసారిగా కోపం వచ్చిన ప్రియుడు తాము వెళ్తున్న కారులోనే ఆమెపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు కారులోంచి బయటకు తోసేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది. మగర్‌పట్ట సిటీలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న జుబై పటేల్ (25) అనే వ్యక్తి, తన మాజీ ప్రియురాలిపై దాడి చేసినందుకు అతడిపై ఖడ్కి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
రాత్రి షిఫ్టు ముగించుకుని తిరిగి వస్తుంటే కారులో ఇద్దరి మధ్య ఫోన్ నంబర్ విషయమై గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా ఆమె మాత్రం తన కొత్త నంబర్ ఇచ్చేది లేదని చెప్పడంతో అతడికి బాగా కోపం వచ్చింది. ఆమెను కారులో విపరీతంగా కొట్టి, తలుపు తెరిచి కిందకు తోసేయబోయాడు. దాంతో భయపడిన డ్రైవర్ కారును ఆపగా, అమెను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చేశాడు. ఆమె కడుపులో కొడుతూ.. చివరకు పీకనొక్కేయడానికి కూడా ప్రయత్నించాడు. అంతలో ఇతరులు వచ్చి విడదీశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మీద హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్పటారు.
కొన్నేళ్ల క్రితం వరకు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, పటేల్ తల్లిదండ్రులకు వాళ్ల పెళ్లి ఇష్టం లేకపోవడంతో విడిపోయారు. పటేల్ మాత్రం పెళ్లి మాట ఎలా ఉన్నా కొన్నాళ్లు కలిసుందామని ప్రతిపాదించాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య విడిపోదామంటూ ఒక ఒప్పందం కూడా కుదిరింది. తాను ఆమెతో మాట్లాడదామని ప్రయత్నించినా ఆమె ఒప్పుకోకపోవడంతో నిరాశ చెందానని, అందుకే ఆమెను చంపేయాలనుకున్నానని పోలీసుల విచారణలో పటేల్ చెప్పాడు.
Advertisement