’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది! | Someone posted Rajinikanth Kabali review online and the world is going crazy | Sakshi
Sakshi News home page

’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!

Published Thu, Jul 21 2016 6:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!

’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!

‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్‌ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్‌ పేరిట  ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 30వేల మంది ఆయన పేరును ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆయన తన రివ్యూను తొలగించారు. అయినప్పటికీ ఆయన రివ్యూ పలుచోట్ల షేర్‌ అయింది.

ఇంతకూ ఆయన ఏం రాశారంటే..
బే ఏరియా సినీ పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు.. ‘కబాలి’ సినిమా ప్రివ్యూను నేను చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాను. మిశ్రమ భావాలతో బయటకు వచ్చాను. రజనీ అభిమానులకు ఇది కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. వయస్సు మీదపడిన సూపర్ స్టార్ ప్రదర్శించే దూకుడును చూసి ఇతరులూ ఛలోక్తులతో ఆనందించవచ్చు.

కథ విషయానికొస్తే..
 మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్  నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం  (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు.


రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్‌ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్‌ ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది.

మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు.

(ఇది ఫేస్‌బుక్‌లో బాలాజీ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement