మోదీ ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం!
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ని దాటి ఉగ్రవాదులపై విజయవంతంగా దాడులు జరిపిన భారత్ సైన్యాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభినందించారు. దేశ ప్రజల రక్షణలో, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడుల ద్వారా దాయాది పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చినట్టు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ’మా దేశ ప్రజలపై, సైనికులపై దాడులను, చొరబాట్లను నివారించాలన్న దేశ సంకల్పాన్ని ఇది చాటి చెపుతోందని ఆమె పేర్కొన్నారు.
’భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న సీమాంతర ఉగ్రవాద దాడుల బాధ్యత పాకిస్థాన్‌దేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తన గడ్డపై ఉగ్రవాదులకు ఆవాసం, మౌలిక వసతులను కల్పించడాన్ని ఇకనైనా పాక్ మానుకుంటుందని పార్టీ ఆశిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె వెల్లడించారు.