సోనియా ఆస్తులు 12 వేల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెందిన స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ. 12 వేల కోట్లు (2 బిలియన్ డాలర్లు). ప్రపంచంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న 20 మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్, ఒమన్ దేశ సుల్తాన్, మొనాకో యువరాజు, కువైట్ షేక్‌ల కన్నా సోనియా సంపన్నురాలు. రాజులు, మహారాణులు, అధ్యక్షు లు, సుల్తాన్‌లు ఆ లిస్ట్‌లో ఉన్నారు. అందులో 40 బిలియన్ డాల ర్లతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందులో చోటే సంపాదించలేదు. థాయిలాండ్ రాజు భుమిబోల్ ఆదుల్యదేజ్ రెండో స్థానంలో ఉన్నారు.
అమెరికాలోని లాస్‌ఏంజిలెస్‌కు చెందిన ‘హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్’ వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది. అయితే, సమాచారం ఎక్కడి నుంచి సేకరించారు, ఆస్తుల విలువను ఎలా లెక్కగట్టారు అనే విషయాలపై ఆ సైట్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ‘తమ దగ్గర ఉన్నసమాచారం మేరకు’ అంటూ లిస్ట్‌ను ప్రకటించింది. దాంతో ఆ జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా సోనియాగాంధీ సంపన్నతను నిర్ధారించామని పేర్కొంది. సెలబ్రిటీనెట్‌వర్త్. కామ్ వెబ్‌సైట్ నుంచి సంబంధిత సమాచారం సేకరించినట్లు తెలిసింది. తమ వెబ్‌సైట్లోని సమాచారం కచ్చితంగా సరైనదే అని నిర్ధారించలేమని ఆ సైట్లో ఒక డిస్‌క్లెయిమర్ కూడా ఉండడం విశేషం. బిజినెస్ ఇన్‌సైడర్ అనే సంస్థ కూడా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన అత్యంత ధనిక దేశాధినేతల జాబితాలో సోనియాకు నాలుగో స్థానం కల్పిం చింది. అయితే, సంపన్నుల జాబితాలను రూపొందించడంలో ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ మేగజైన్ మాత్రం సోనియాను తమ లిస్ట్ లో చేర్చలేదు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన స్థిర, చరాస్తుల విలువను సోనియాగాంధీ రూ. 1.38 కోట్లుగా చూపారు.
నమ్మితే నవ్వులపాలే: కాంగ్రెస్
కాగా, హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ జాబితాను హాస్యాస్పదమైనదిగా కాంగ్రెస్ కొట్టిపారేసింది. ‘ఈ అర్థంలేని, హాస్యాస్పద విషయాలను మీరు ప్రచురిస్తే.. మీరే నవ్వులపాలు అవుతారు’ అని మీడియాను ఉద్దేశించి పార్టీ నేత మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు.