Huffington Post
-
సోనియా ఆస్తిపై వెబ్సైట్ వెనుకడుగు
వాషింగ్టన్: ప్రపంచ సంపన్న నేతల్లో యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి 12వ స్థానాన్ని కట్టబెట్టిన అమెరికన్ వెబ్సైట్ హఫింగ్టన్ పోస్ట్ నాలుక్కరుచుకుంది. జాబితాలోంచి సోనియా పేరును తొలగించింది. ఆమె పేరును చేర్చడం వల్ల ఏర్పడిన గందరగోళంపై విచారం కూడా వ్యక్తం చేసింది. సోనియాకు 2 బిలియన్ డాలర్ల (రూ. 12వేల కోట్లకు పైగా) విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్న హఫింగ్టన్.. తమ ఎడిటర్లు సోనియా ఆస్తుల మొత్తాన్ని ధ్రువీకరించుకోలేకపోయారని పేర్కొంది. -
సోనియాకు అంత ఆస్తి లేదు: హఫింగ్టన్ పోస్ట్
ప్రపంచంలో బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ కంటే కూడా సోనియాగాంధీ ధనవంతురాలంటూ పేర్కొన్న అమెరికన్ వెబ్సైట్.. ఆ జాబితాలోంచి సోనియా గాంధీ పేరును తీసేసింది. ఇంత పనికిమాలిన, చెత్త కథనం ఎలా ప్రచురిస్తారంటూ పార్టీ వర్గాలు సదరు న్యూస్ పోర్టల్ మీద మండిపడటంతో వెంటనే సోనియా పేరును తప్పించారు. ఆమెతోపాటు ఖతార్ మాజీ రాజు హమీద్ బిన్ ఖలీఫా అల్ తానీ పేరును కూడా తొలగించినట్లు 'హఫింగ్టన్ పోస్ట్' ఎడిటర్ తమ సైట్లో రాశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నాయకుల పేర్లు ఇవంటూ ఈ న్యూస్ పోర్టల్ ఓ కథనం ప్రచురించింది. సోనియాగాంధీ ఆస్తి 12 వేల కోట్ల రూపాయలని అందులో పేర్కొంది. వేరే సైట్లో ఉన్న కథనం ఆధారంగా సోనియా పేరును అందులో చేర్చామని, వారిని ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నిస్తున్నామని ఎడిటర్ తెలిపారు. అయితే ఆ సైట్ పేరుమాత్రం పేర్కొనలేదు. సోనియా అసలు ఆస్తి ఎంతన్న విషయాన్ని తమ ఎడిటర్లు పరిశీలించలేకపోవడంతో లింకును తీసేశామని, దీనివల్ల చెలరేగిన గందరగోళానికి క్షమాపణ చెబుతున్నామని నాలుగు రోజుల తర్వాత సదరు ఎడిటర్ చెప్పారు. సోనియాగాంధీ ఆస్తి 12 వేల కోట్ల రూపాయలని చెప్పడానికి ఆధారం ఏంటని కాంగ్రెస్ పార్టీ ఆ సైట్‌ను ప్రశ్నించింది. ఇలాంటి పనికిమాలిన, చెత్త కథనాలు పెడితే మిమ్మల్ని చూసి నవ్వుకోడానికి తప్ప మీరెందుకూ పనికిరారంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ న్యూఢిల్లీలో అన్నారు. -
సోనియా ఆస్తులు 12 వేల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెందిన స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ. 12 వేల కోట్లు (2 బిలియన్ డాలర్లు). ప్రపంచంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న 20 మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్, ఒమన్ దేశ సుల్తాన్, మొనాకో యువరాజు, కువైట్ షేక్‌ల కన్నా సోనియా సంపన్నురాలు. రాజులు, మహారాణులు, అధ్యక్షు లు, సుల్తాన్లు ఆ లిస్ట్‌లో ఉన్నారు. అందులో 40 బిలియన్ డాల ర్లతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందులో చోటే సంపాదించలేదు. థాయిలాండ్ రాజు భుమిబోల్ ఆదుల్యదేజ్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికాలోని లాస్ఏంజిలెస్కు చెందిన ‘హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్’ వెబ్సైట్ ఈ జాబితాను రూపొందించింది. అయితే, సమాచారం ఎక్కడి నుంచి సేకరించారు, ఆస్తుల విలువను ఎలా లెక్కగట్టారు అనే విషయాలపై ఆ సైట్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ‘తమ దగ్గర ఉన్నసమాచారం మేరకు’ అంటూ లిస్ట్‌ను ప్రకటించింది. దాంతో ఆ జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా సోనియాగాంధీ సంపన్నతను నిర్ధారించామని పేర్కొంది. సెలబ్రిటీనెట్వర్త్. కామ్ వెబ్సైట్ నుంచి సంబంధిత సమాచారం సేకరించినట్లు తెలిసింది. తమ వెబ్‌సైట్‌లోని సమాచారం కచ్చితంగా సరైనదే అని నిర్ధారించలేమని ఆ సైట్లో ఒక డిస్‌క్లెయిమర్ కూడా ఉండడం విశేషం. బిజినెస్ ఇన్సైడర్ అనే సంస్థ కూడా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన అత్యంత ధనిక దేశాధినేతల జాబితాలో సోనియాకు నాలుగో స్థానం కల్పిం చింది. అయితే, సంపన్నుల జాబితాలను రూపొందించడంలో ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ మేగజైన్ మాత్రం సోనియాను తమ లిస్ట్ లో చేర్చలేదు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన స్థిర, చరాస్తుల విలువను సోనియాగాంధీ రూ. 1.38 కోట్లుగా చూపారు. నమ్మితే నవ్వులపాలే: కాంగ్రెస్ కాగా, హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ జాబితాను హాస్యాస్పదమైనదిగా కాంగ్రెస్ కొట్టిపారేసింది. ‘ఈ అర్థంలేని, హాస్యాస్పద విషయాలను మీరు ప్రచురిస్తే.. మీరే నవ్వులపాలు అవుతారు’ అని మీడియాను ఉద్దేశించి పార్టీ నేత మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. -
ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనవంతురాలని 'హఫింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన రాజకీయ నేతల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. సోనియా ఆస్తి రెండు బిలియన్ డాలర్లని హఫ్ పోస్ట్ తెలిపింది. భారత కరెన్సీలో సోనియా ఆస్తుల విలువ 12 వేల కోట్ల రూపాయలని పోస్ట్ కథనం. 50 బిలియన్ల ఆస్తితో జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్ రాజు భుమిబోల్ అదుల్యాదెజ్, బ్రూనై సుల్తాన్ హసనల్ ఉన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆస్తి ఐదొందల మిలియన్ డాలర్లు మాత్రమే. 2009లో సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు 1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు. -
'బీజేపీని వీడితే మోడీకి అన్నా హజారే మద్దతు'
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని వీడితే తాను మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నాహజారే అన్నట్టు అమెరికా మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది. రెండు వారాల అమెరికా పర్యటనలో భారత సంతతికి చెందిన కమ్యూనిటీలు, విద్యావేత్తలు, మేధావులతో డెలావర్ లోని ఓ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు హఫింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. తనకు రాజకీయ పార్టీల మీద విశ్వాసం లేదని, బీజేపీకి చెందిన నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వలేనని హజారే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ మోడీ బీజేపీని వీడితే తప్ప తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేసినట్టు సమాచారం.