
సోనియాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హుటాహుటిన అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించారు. ఆహార భద్రత బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలపై లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా రాత్రి 8.15 గంటల సమయంలో సోనియా నిస్సత్తువకు గురయ్యారు. వెంటనే ఆమెను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు కార్డియాలజీ విభాగంలో అన్నిరకాల పరీక్షలు చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. ఎయిమ్స్ ఇన్‌చార్జి డెరైక్టర్ ఆర్.సి.డేకా, కార్డియో-థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి బలరామ్ ఐరాన్‌తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు సోనియాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఆదివారం రాత్రి నుంచే విషజ్వరంతో బాధపడుతున్నారని, ఆమె నివాసంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. నిస్సత్తువతో పాటు గుండెల్లో కొద్దిగా నొప్పి ఉందని సోనియా చెప్పడంతో.. కార్డియో-న్యూరో విభాగానికి తరలించే ముందు ఐసీయూలో ఉంచినట్లు ఎయిమ్స్ వర్గాలు వివరించాయి. ఈసీజీతో పాటు కొన్ని పరీక్షలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఆందోళన చెందాల్సిందేమీ లేదని, సోనియా బాగున్నారని కాంగ్రెస్ నేత ద్వివేది చెప్పారు. ఇలావుండగా ఎయిమ్స్ చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేశారు. సోనియా త్వరగా కోలుకోవాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, ఆనంద్‌శర్మ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎయిమ్స్‌కు వెళ్లి సోనియా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాహుల్‌తో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలు ఎయిమ్స్ కార్డియో-న్యూరో విభాగంలో ఆమె వద్ద ఉన్నారు.