పొగడాలన్నా ట్వీటే. తిట్టాలన్నా ట్వీటే. ఏం చెప్పాలనుకున్నా ట్వీట్‌తోనే చెప్పడం ఆయన అలవాటు. ఆ ట్వీట్ కోసం వేలాదిమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నచ్చినా, నచ్చకపోయినా కోట్లాదిమంది ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకీ ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ట్వీట్ ఎవరంటే.. డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అగ్రరాజ్యానికి అధినేత అయినప్పటికీ ట్రంప్‌ది డిఫరెంట్ స్టైల్. మూసపద్ధతులు, అనవసర మొహమాటాలకు ఆయన ఆమడదూరంలో ఉంటారు. ఇదే సమయంలో సోషల్‌మీడియాను ఉపయోగించుకోవడంలో మాత్రం అందరికంటే ముందుంటారు. మరీ ముఖ్యంగా ట్విటర్‌ను వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ట్విట్టర్ పిట్టను ఆయన కూత పెట్టించినట్లుగా మరే నాయకుడూ కూత పెట్టించలేదంటే అతిశయోక్తి కాదు.
ట్వీట్...అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు ఇదే ప్రధాన ఆయుధం. దేశాధినేతలకు స్వాగత వచనాలు పలకాలన్నా, ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాలన్నా, విమర్శకులపై ఘాటు మాటలతో దాడి చేయాలన్నా ఆయనకు ట్విట్టరే ఆధారం. తనదైన శైలిలో ఆయన చేసే ట్వీట్లు అప్పుడప్పుడూ ప్రకంపనలు రేపుతున్నాయి.
ట్రంప్ ట్వీట్ల ధాటికి బడా మీడియా సంస్థలు కూడా లబోదిబోమంటున్నాయి. తాజాగా ఎంఎస్‌ఎన్బీసీ ఛానల్‌కు చెందిన మికా బ్రెజెన్క్సీ, జో స్కార్‌బరోలపై ట్రంప్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సీఎన్‌ఎన్ చానెల్‌ను తాను కొడుతున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్ వీడియో పోస్టు చేసి ఆయన తాజాగా సంచలనం రేపారు. గతంలో ఓ రెజ్లింగ్ మ్యాచ్ సందర్భంగా ట్రంప్ ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఆ వ్యక్తి ముఖానికి సీఎన్‌ఎన్ లోగోను అంటించిన వీడియోను తాజాగా ట్వీట్ చేసిన ట్రంప్.. ఎఫ్‌ఎన్‌ఎన్ (ఫేక్ న్యూస్ నెట్‌వర్క్) అంటూ ఆ చానెల్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ ట్వీట్లపై డెమోక్రటిక్, రిపబ్లికన్ నేతలు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును తప్పుబట్టారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గడంలేదు.
ట్విట్టర్ ఆయనకు కలిసి వచ్చింది..
వాస్తవానికి ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రపంచానికి పెద్దగా తెలీదు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖరారు కావడం, ఆ సమయంలో ట్రంప్ వ్యవహారశైలి వివాదాస్పదం కావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగింది. అయితే, ఆ ఎన్నికల్లో అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రంప్‌ను ఏకిపారేసింది. హిల్లరీ క్లింటన్ గెలుపు తథ్యం అనే విధంగా కథనాలు వండి వార్చిన ప్రధాన మీడియా ట్రంప్ అసలు పోటీదారుడే కాదన్నట్లుగా వ్యవహరించింది. ఇది ట్రంప్‌కు మంట పుట్టించింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా తనకు పూర్తి వ్యతిరేకంగా మారిపోవడంతో ఆయన దృష్టి సోషల్ మీడియాపై పడింది. ముఖ్యంగా ట్విట్టర్‌ను బేస్ చేసుకొని తన ఆలోచనలు, ప్రణాళికలను ప్రజలకు చెప్పుకుంటూ పోయారు. ఇది ఆయనకు కలసి వచ్చింది. స్వయంగా ట్రంపే ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సోషల్ మీడియానే కారణమని ట్రంప్ స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్‌లో దాదాపు 3 కోట్ల 30 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఆయన ప్రతి రోజూ సగటున 68 వేల మంది కొత్త ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. రోజుకు సగటున 7 ట్వీట్లు చేస్తారు. ట్రంప్ తర్వాతి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారు. మోదీకి 3కోట్ల 12లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అందుకే మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మోదీ, తాను సోషల్ మీడియాలో ప్రపంచ నాయకులమని ట్రంప్ పేర్కొనడం విశేషం.