
వేగంగా వెళ్లి.. నదిలో పడి..
చెన్నై: బైక్ పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు ఫుట్ పాత్ మీద పాదచారులను తప్పించబోయి గోడను ఢీ కొట్టి నదిలో పడ్డాడు. ఆఫీస్ అవసరాలకు కావసిన వస్తువులను తెచ్చేందుకు డీ ఇన్ఫాంటో(20) బైక్ మీద పూనమల్లే రోడ్డులో అతి వేగంతో వెళ్తున్నాడు. అంపా స్కైవే దగ్గరకు చేరుకోగానే అతడి బైకు అదుపు తప్పి.. అటువైపు వెళ్తున్న పాదాచారుల వైపు వెళ్లసాగింది. దాంతో వారికి ప్రమాదం జరగకుండా తప్పించాలన్న ప్రయత్నంలో ఇన్ఫాంటో నదిని అనుకుని ఉన్న గోడను ఢీ కొట్టి 25 మీటర్ల లోతుకు నీళ్లలో పడిపోయాడు.
దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని రక్షించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతనికి ప్రథమ చికిత్స అందించి నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.