స్పైస్‌జెట్ హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కలర్ ద స్కైస్ పేరుతో తాజాగా మరో డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో కనిష్టంగా రూ.1,699కు, అంతర్జాతీయ రూట్లలో రూ.3,799కు (అన్ని చార్జీలు కలుపుకొని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ చార్జీలకు లక్ష సీట్లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవ్లి పేర్కొన్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన బుకింగ్స్ గురువారం (రేపు-ఈ నెల 26) వరకూ ఉంటాయని, వచ్చే నెల 1 నుంచి ఏప్రిల్ 20 వరకూ చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.
ప్రయాణికులు హోలీ పండుగ పర్యాటక ప్రణాళికలకు ఈ ఆఫర్ మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా హైదరాబాద్-విజయవాడ, బెంగళూరు-హైదరాబాద్, ఢిల్లీ-డెహ్రాడూన్, గౌహతి-కోల్‌కతా, అహ్మదాబాద్-ముంబై రూట్లలో విమాన టికెట్లను రూ.1,699కే అందిస్తున్నామని వివరించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం పాత ప్రమోటర్ అజయ్ సింగ్ చేతికి వచ్చిన ఒక్కరోజు తర్వాత తాజా ఆఫర్ రావడం విశేషం. స్పైస్‌జెట్ నుంచి ఈ ఏడాది ఇది ఐదో ఆఫర్.
మళ్లీ ప్రమోటర్‌గా అజయ్‌సింగ్
స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్, కాల్ ఎయిర్‌వేస్‌లకు ఉన్న మొత్తం 56.4 శాతం వాటా(35,04,28,758 ఈక్విటీ షేర్లు), పాత ప్రమోటర్ అజయ్‌సింగ్‌కు బదిలీ అయింది. ఈ వాటా బదిలీతో ఇప్పుడు స్పైస్‌జెట్ యాజమాన్యం అజయ్‌సింగ్‌కు దక్కింది. కాగా, స్పైస్‌జెట్ రూ.100 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత)బకాయిలను చెల్లించినట్లు సమాచారం.
ఎయిర్‌కోస్టా కూడా...హైదరాబాద్-విజయవాడ టికెట్ రూ. 999
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన కంపెనీ అయిన ఎయిర్‌కోస్టా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఒకవైపు టికెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. రూ.999కే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, రూ.1,999తో హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి, అలాగే రూ.1,499తో హైదరాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నం నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నానికి వెళ్లొచ్చు. ఈనెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎకానమీ టికెంట్ బుకింగ్స్ పైనే అది కూడా పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయి. మార్చి 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణ తేదీలుగా నిర్ణయించింది.