బరువు 15 కేజీలు దాటితే బాదుడే బాదుడు!
- చెకిన్ బ్యాగేజీ చార్జీలను పెంచనున్న స్పైస్‌జెట్
- డీజీసీఏ ఆదేశాలను హైకోర్టు కొట్టేయడంతో ముందుకు..
న్యూఢిల్లీ: తక్కువ ధరలకే విమానయాన సేవలు అందిస్తోన్న స్పైస్‌జెట్ సంస్థ ఇక.. చెకిన్ బ్యాగేజీపై భారీ రుసుము వసూలుచేయనున్నట్లు తెలిసింది. విమానాల్లో చెకిన్ లగేజీ బరువు 15 కేజీలు దాటితే.. ఒక్కో అదనపు కేజీకి రూ.300 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ప్రైవేటు విమానయాన సంస్థల చెకిన్ బ్యాగేజీ చార్జిలను నియంత్రిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఒక్కో విమాన ప్రయాణికుడు 15 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆపై ఒక్కో కేజీపై రూ.100 మాత్రమే అదనంగా తీసుకోవాలని పేర్కొంది. తమకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్(ఎఫ్‌ఐఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విధించే చార్జీలను నియంత్రించే అధికారం డీజీసీఏకు లేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
సమగ్ర విచారణ అనంతరం డీజీసీఏ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రైవేట్ సంస్థలు బ్యాగేజీలపై చార్జీలు పెంచేందుకు ఆటంకాలు తొలిగిపోయినట్లయింది. అందరికంటే ముందు స్పైస్ అదనపు చార్జీలను ప్రకటించే వీలుంది. ఇక ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మాత్రమే 23 కేజీల బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లేవీలుంది.