సత్తాచాటుతున్న సా'మాన్యులు'
చెన్నై: చెన్నై వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి సహాయ బృందాలు ప్రయత్నిస్తుండగా, సామాన్యులు సైతం బాధితులను ఆదుకోవడానికి కృషి చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ హీరోల్లో బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల ఆదిత్యా వెంకటేశ్ కూడా ఒకరు. ఆయన తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి చెన్నైలోని వరద ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ మెడిసిన్‌లు అవసరం ఉన్నవారికి వాటిని అందిస్తున్నారు.
ప్రత్యేకించి గర్భిణులకు అవసరమైన మెడిసిన్‌లను ఎక్కువ మొత్తంలో తమ వద్ద ఉంచుకొని వారికి అందజేస్తున్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో పోస్టుల ఆధారంగా ఆపదలో ఉన్న వారి వివరాలు తెలుసుకొని వారి వద్దకు వెళ్లి తాము మందులు అందిస్తున్నట్లు ఆయన ‘మెయిల్ టుడే’కు చెప్పారు. 33 ఏళ్ల మోషిన్ పటేల్ కూడా ముంబై నుంచి చెన్నైకు బయల్దేరి వచ్చి అక్కడివారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో ఆయన తన నంబర్ షేర్ చేశారు. ఆ నంబర్‌ను సంప్రదించి రీచార్జ్ కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన మొబైల్ రీచార్జ్ చేస్తుండడం గమనార్హం. ‘‘నేను ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో నా ఆప్త మిత్రులను కోల్పోయాను. చెన్నైలో ప్రస్తుత పరిస్థితి నన్ను కలచి వేస్తోంది. అందుకే నేను ఈ రకమైన సహాయాన్ని ఎంచుకున్నాను’’ అని ఆయన మెయిల్ టుడేతో చెప్పారు. వెంటకేశ్, మోషిన్‌లలాంటి ఎందరో సామాన్య హీరోలు చెన్నై బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే కొందరి వివరాలే మీడియా ద్వారా బయటకు తెలుస్తున్నాయి. అలా బయటకు తెలియని హీరోలకు కూడా సలామ్ కొడదాం!
ప్రధాని ఫొటోలపై.. ‘ఫొటోషాప్’ మరక!
సాక్షి, హైదరాబాద్: చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ వ్యూకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైంది. పీఎం ఏరియల్ వ్యూ ఫొటోస్‌ను ట్విటర్ ద్వారా మీడియాకు విడుదల చేసిన పీఐబీ అత్యుత్సాహం కొద్దీ ఫొటోషాప్‌తో వాటిని తీర్చిదిద్దింది. ఆ ఫొటోలను శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని మీడియా వర్గాలూ ప్రముఖంగా ప్రచురించాయి. మామూలుగా ఏరియల్ వ్యూ నుంచి చూస్తే వరద పరిస్థితి స్పష్టంగా కనిపించే అవకాశాలేమీ ఉండవు.
అయితే పీఐబీ నుంచి వెలువడిన ఫొటోల్లో మాత్రం విమానం కిటీకీ నుంచే వరద పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మార్ఫ్ చేశారు. ఈ విషయం తేటతెల్లం కావడంతో పీఐబీ తన పొరపాటును సవరించుకునే ప్రయత్నం చేసింది. ప్రధాని ఏరియల్ వ్యూ ఫొటోలకు సంబంధించిన ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయితే పీఐబీ అత్యుత్సాహంతో ప్రధాని ఫొటోలను మార్ఫ్ చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.