ధోనీ-అభిమాని: ఓ అరుదైన ఘటన!
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న ధోనీ.. భారత్-లంక నాలుగో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ లంక అభిమాని అకస్మాత్తుగా మైదానంలో దూసుకొచి.. ధోనీ ప్రాక్టీస్ సెషన్ అడ్డుకున్నాడు. ఎందుకంటే.. ధోనీతో సెల్ఫీ తీసుకోవడానికి.. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అతను సెల్ఫీ తీసుకోవడం భారత ఆటగాళ్లను విస్మయపరిచింది.
గురువారం జరిగే నాలుగో వన్డేతో ధోనీ 300 వన్డేలు ఆడిన ఘనతను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా మంగళవారం ఆయన మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగా ఓ లంక అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. మైదానంలోకి వచ్చాడు. మొదట రోహిత్ శర్మను చూసి ధోనిగా పొరపడి అతని వద్దకు వెళ్లాడు. దీంతో ధోనీ అక్కడ ఉన్నాడని రోహిత్ చూపించాడు. అభిమాని మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ధోనీ వద్దకు వెళ్లి అడిగి సెల్ఫీ తీయించుకున్నాడు. అభిమానితో హుందాగా ప్రవర్తించిన ధోనీ సెల్ఫీ దిగిన అనంతరం గప్‌చుప్‌గా వెళ్లాలని అతనికి సూచించాడు. ఆ తర్వాత అతను వెళ్లిపోగా.. ఇంతలోనే భద్రతాసిబ్బంది భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మైదానంలో మధ్యలోకి అతను ఎలా వచ్చాడని ఆరా తీయగా.. అతను నాలుగో వన్డే జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియం సిబ్బంది అని, అందుకే ధోనీ వద్దకు రావడంలో అతనికి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని తెలిసింది.