సభలో స్టాలిన్ ధర్నా.. వాయిదాకు పట్టు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వేదికగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాసనసభలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బలపరీక్షను పదిరోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో నేలపై కూర్చొని ఆయన ధర్నా చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ధర్నాలో కూర్చున్నారు. దీంతో సభలో తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
20 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి బలవంతంగా గెంటేయాలన్న స్పీకర్ ధనపాల్ నిర్ణయంపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరును ఖండిస్తూ స్టాలినే స్వయంగా ఆందోళనకు కూర్చున్నారు. బలపరీక్షను 10రోజులపాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బలపరీక్ష నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.